తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Crop Loan : రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్- రేషన్ కార్డు కుటుంబ నిర్థారణకే అంటోన్న మంత్రి

TG Crop Loan : రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్- రేషన్ కార్డు కుటుంబ నిర్థారణకే అంటోన్న మంత్రి

15 July 2024, 22:39 IST

google News
    •   TG Crop Loan Waiver : తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ డేటా ప్రామాణికం అని ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

TG Crop Loan Waiver : రైతు రుణమాఫీకి 2018 బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలే 2024లో రైతు కుటుంబాల గుర్తింపునకు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2018లో రుణమాఫీ పేరిట రూ.20 వేల కోట్లు ప్రకటించి, 2023 ఎన్నికల ఏడాది రూ.13 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, అందులో రూ.1400 కోట్లు వెనక్కి వచ్చినా కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు.. ఈ రోజు మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. రుణమాఫీ పథకంలో రేషన్ కార్డ్ కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికం మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ కాగానే రుణమాఫీ మిగతా వారికి కూడా వర్తింపచేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంటే హర్షించాల్సిన గత ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక మాజీ మంత్రులు, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించడం చూస్తున్నారన్నారు. రైతాంగం వీరిని తప్పక అసహ్యించుకుంటారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని దివాళా తీయించిన గత ప్రభుత్వ పెద్దలు , కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణ మాఫీని అమలు చేయడం ఓర్వలేక, రైతాంగం పట్ల కపట ప్రేమ నటిస్తూ విషం కక్కుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన రుణ మాఫీ రైతులకు ఏ మాత్రం, ఎంత మందికి ప్రయోజనం చేకూరిందో , ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడితే వారి విలువ కాపాడుకోగల్గుతారని మంత్రి సూచించారు.

రైతుల వడపోతల పైనే దృష్టి - హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసమన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతుందని ఎద్దేవా చేశారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అన్నారు. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారని హరీష్ రావు విమర్శించారు.

మార్గదర్శకాలు కాదు, మభ్యపెట్టే ప్రయత్నాలు - నిరంజన్ రెడ్డి

రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావవి .. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్నారు. తెలంగాణలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని, తద్వారా విరివిగా ఉపాధి అవకాశాలు లభించాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ రంగాల కష్ట, నష్టాల మూలంగా అనేకమంది రైతులు ప్రాణాలను కోల్పోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం మూలంగానే రైతు కుదుటపడతాడు, వ్యవసాయం సుస్థిరం అవుతుందని భావించి కేసీఆర్ రెండు విడతలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144.10 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. రెండో విడతలో 22 లక్షల 98 వేల 039 రైతులకు చెందిన రూ.13,000.51 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మిగిలింది రూ.6440 కోట్లు మాత్రమే అన్నారు. మొత్తం రెండు విడతలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.29,144.61 కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పై చిలుకు రైతాంగంలో ఆశలు రేపిందన్నారు.

నాలుగు రోజులకే మాట మార్చారు

తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారని, సరిగ్గా నాలుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశారని మాజీ నిరంజన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వాలు కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డులను పరిశీలించేవారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పది ఎకరాలుండి పింక్ కార్డులు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తించదా? మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి? రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులను కోరడం అంటే రైతుల మధ్య వివాదాలను సృష్టించడమే అన్నారు. ఎన్నికల్లో ఆశ చూపి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ .. అధికారం వచ్చాక హామీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుందన్నారు. పీఎం కిసాన్ డాటా ఉంటే మళ్లీ రుణమాఫీ అమలుకు వ్యవసాయ అధికారులను బాధ్యులను చేయడం ఎందుకు ? రైతుల నుంచి ఫిర్యాదులు ఆహ్వానించడం ఎందుకు ? తెల్ల రేషన్ కార్డు ప్రామాణికత ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రుణమాఫీ విషయంలో చిత్తశుద్ధి లేకనే గందరగోళంగా రుణమాఫీ మార్గదర్శకాలు నిర్ణయించిందన్నారు.

తదుపరి వ్యాసం