Crop Loan in Telangana : మీ రుణం మాఫీ అయిందా..? కొత్తగా రుణాలు ఇలా పొందండి
Crop Loans in Telangana: తెలంగాణలో లక్ష లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది సర్కార్. మరికొందరి రైతుల రుణాలను కూడా మాఫీ చేసే పనిలో ఉంది. అయితే మాఫీ అయిన వాళ్లు… బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ చూడండి…
Crop Loans in Telangana: గత ఎన్నికల సమయంలో లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలకు హామీనిచ్చింది బీఆర్ఎస్. అందుకు అనుగుణంగా… ఇటీవలే రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. 2018 డిసెంబరు 11 నాటికి ఉన్న రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సంబంధిత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా… రూ.99 వేల 999 వరకు అప్పులు ఉన్న వారందరికీ ఆగస్టు 14వ తేదీన ఏక మొత్తంలో చెల్లింపులు చేసింది సర్కార్. ఆ ఒక్క రోజే రుణమాఫీకి సర్కారు ఏకంగా రూ.5 వేల 809 కోట్ల చెల్లింపులు చేసింది. దీంతో 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు సంబంధించి రూ.7 వేల 753 కోట్ల పైగా రుణమాఫీ చెల్లింపులు పూర్తయ్యాయి.
లక్ష రూపాయల రుణం తీసుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సెప్టెంబర్ 2వ వారంలోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే నిధుల లభ్యతను బట్టి మిగిలిన రైతులకు కూడా చెల్లింపులు చేసే పనిలో ఉంది. ఇంకా 10వేల కోట్లకు పైగా నిధులు అవసరం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మేరకు తెలుస్తోంది. అయితే లక్ష లోపు రుణాలు మాఫీ అయిన వారు మాత్రం… మళ్లీ లోన్ తీసుకునే అవకాశం ఉంది.
మాఫీ అయిన రైతులు తిరిగి రుణాలు తీసుకునే అంశంపై హిందుస్థాన్ టైమ్స్ తెలుగు… రంగారెడ్డి జిల్లా పరిధిలోని లోయపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులను సంప్రదించింది. రుణం పొందటం, కావాల్సిన డాక్యూమెంట్లతో పాటు ఇతర వివరాలను అడిగి తెలుసుకుంది.
- కొత్తగా రుణం తీసుకోవాలని అనుకునే రైతులు మొదటగా మీకు ఎంత రుణం మాఫీ అయిందో తెలుసుకోవాలి. ఉదాహరణకు మీరు 2 లక్షల రుణం తీసుకొని ఉంటే.. మీకు 99 వేల లోపు మాఫీ అవుతుంది. మిగిలిన డబ్బులను బ్యాంకులో చెల్లింది… తిరిగి రుణం పొందవచ్చు.
- రుణం పొందాంలంటే కొత్తగా ఇచ్చిన పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- భూమికి సంబంధించి 1 బీ కూడా తప్పనిసరి.
- రుణం తీసుకునే రైతు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు సమర్పించాలి.
- 2 పాస్ ఫొటోలు ఇవ్వాలి.
- తొలిసారి రుణం తీసుకునే రైతులకు ఎకరానికి 45వేలు ఇస్తున్నారు. గతంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ఎకరానికి 50వేలకు పైగా ఇస్తున్నారు.
- గతంలో ఇతర బ్యాంకులో రుణాలు ఉంటే అక్కడ్నుంచి NOC సర్టిఫికెట్ తీసుకొని రావాలి.