Maoists In Adilabad : మావోయిస్టులు ఎంటర్ అయ్యారా? వచ్చారని హైప్ క్రియేట్ చేశారా?
06 September 2022, 15:04 IST
- ఆదిలాబాద్‌లో మావోయిస్టుల కదలికలపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని గ్రామాలలో తుపాను ముందు ప్రశాంతతలా వాతావరణం కనిపిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రాణహిత, గోదావరి నదుల తీరం వెంబడి తిరుగుతూ వాహనాల తనిఖీలు, ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీ గూడేల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల బృందం ఆదిలాబాద్‌లోకి ప్రవేశించి అంతర్గత ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇంకోవైపు తగిన కారణాలు లేకుండానే పోలీసు యంత్రాంగం మావోయిస్టుల కదలికల చుట్టూ హైప్ క్రియేట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10-15 మంది మావోయిస్టుల బృందం ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అంచనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం లేదు.
ఓ మహిళా ఫొటో ప్రచారంలో ఉంది. ఆసిఫాబాద్ జిల్లా పంగిడిమాదరలో తప్పిపోయిన ఆదివాసీ మహిళ రాంబా బాయి (30) ఫోటో అని వార్తలు వ్యాపించాయి. అయితే రాంబా బాయి కాదని, ఛత్తీస్‌గఢ్ క్యాడర్ కు చెందిన ఓ మహిళా మావోయిస్టు అని పోలీసులు చెబుతున్నారు. ఆ ఫోటో నకిలీదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రంబా బాయి అదృశ్యం మిస్టరీగా మిగిలిపోయింది. డిసెంబర్ 16, 2019 నుండి ఆమె ఆచూకీ తెలియలేదు.
కొంతమంది పోలీసు ఇన్‌ఫార్మర్లు డబ్బు సంపాదించేందుకు మావోయిస్టుల కదలికలకు సంబంధించిన విషయాలను చెబుతున్నారని తెలిసింది. కానీ అందులో వాస్తవం ఎంత అని నిర్ధారించకుండా కేవలం సమాచారాన్ని పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌తో పాటు పోలీసు ఇన్‌ఫార్మర్ల నెట్‌వర్క్ కూడా పెరిగిపోయింది. మావోయిస్టులు ఆదివాసీ యువకులను రిక్రూట్ మెంట్ చేసుకోవడం అనేది వారికి కష్టంగా మారింది. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ 2020 ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు శ్రమిస్తే.. ఇటీవల ఒకరు లేదా ఇద్దరు మాత్రమే మావోయిస్టు పార్టీలో చేరారని సమాచారం.
ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 19న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ రూరల్ మండలం కదంబ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో భద్రాద్రి కొత్తగూడెంలోని చర్ల వద్ద, ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారని కొందరు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వర్షాకాలంలో ఆదిలాబాద్ వైపు వస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని మావోయిస్టులు అనుకుంటున్నారని ప్రచారం ఉంది. తమ పట్టును తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పోలీసులు అనుకుంటున్నారు.
చాలా మంది ఆదివాసీ యువకులు ఇప్పుడు సెల్‌ఫోన్ బ్రౌజింగ్, ఆధునిక జీవనశైలికి బానిసలయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. తమ గ్రామాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని, కలెక్టర్, ఎస్పీ తమ గ్రామాలకు వెళ్లినప్పుడల్లా సిగ్నల్ సమస్యలపై ఫిర్యాదులు చేస్తుంటారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో యువకులు రిస్క్ తీసుకోవడానికి, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అభిప్రాయం వ్యక్తమవుతోంది.