Gold Smuggling : టోల్ గేటు వద్ద తనిఖీలు…. 10కేజీల బంగారం పట్టివేత:
పోలీసులు, కస్టమ్స్ కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న స్మగ్లింగ్ దందాను కస్టమ్స్ అధికారులు బయటపెట్టారు. ప్రయాణికుల వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి చెన్నై నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాలను పట్టుకున్నారు.
విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున సాగుతున్న బంగారం స్మగ్లింగ్‌ను అధికారులు పట్టుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కార్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి తరలిస్తున్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు దారికాచి పట్టుకున్నారు. జాతీయ రహదారుల మీదుగా ప్రయాణికుల వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని విశ్వసనీయ సమాచారంతో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రి ప్రాంతాలకు భారీగా బంగారం తరలిస్తున్నారనే సమాచారంతో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు జాతీయ రహదారులపై నిఘా పెట్టారు. బంగారం కడ్డీల రూపంలో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర నిఘా ఉంచారు. విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేపట్టారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేసినా మొదట ఏమి బయటపడలేదు.
నిఘా వర్గాలకు అందిన సమాచారాన్ని ధృవీకరించుకునేందుకు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో భారీగా బంగారం లభించింది. వాహనాల్లో ప్రయాణికుల సీట్ల వెనుక భాగాన్ని తొలగించి బాక్సుల్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీట్ల కింద కూడా చిన్న అరల్ని ఏర్పాటు చేశారు. నిందితుల్ని విచారించడంతో వాహనాల్లో ఉన్న ప్రత్యేక ఏర్పాట్లను అధికారులకు వివరించారు.
మొత్తం మూడు కార్లను తనికీ చేయడంతో వాటిలో 10.77 కేజీల బంగారం బయటపడింది. మూడు వాహనాల్లో దొరికిన బంగారం విలువ దాదాపు రూ.5.80కోట్లు ఉంటుందని లెక్కించారు. అదే సమయంలో కాకినాడ కస్టమ్స్ విభాగం ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో 24కేజీల వెండి బార్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని విశాఖపట్నంలోని ఆర్ధిక నేరాల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో 2014 కస్టమ్స్ విభాగం ఏర్పాటైంది. కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా జాతీయ రహదారులు వందల కిలోమీటర్లు విస్తరించి ఉండటంతో తనిఖీలకు దొరక్కుండా నిందితులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం దొరకడంతో కస్టమ్స్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాపిక్