NIA Searches : ఏపీలో ఎన్ఐఏ సోదాలు.. మావోయిస్టులకు నగదు పంపిస్తున్నట్టు సమాచారం వచ్చిందా?
ఏపీలో ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులు, మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేసింది.
దేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో పలుచోట్ల మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో కొంతమంది ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంపై, విరసం నేతల నివాసాలపై సోదాలు జరిగాయి. ఎన్ఐఏ బృందాలు మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న విషయంపై కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నారు.
టంగుటూరు మండలం (బ్లాక్) మారుమూల ఆలకూరపాడు గ్రామంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడలో కూడా రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. దొడ్డి ప్రభాకర్ నివాసంతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు యువకులు అద్దెకు ఉంటున్న మరో ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. సెర్చ్ ఆపరేషన్ల ఫలితాల వివరాలు తెలియరాలేదు.
సీపీఐ-మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ గత ఏడాది అక్టోబర్ 14న ఛత్తీస్‌గఢ్‌లో కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. ఆయన ఇంట్లోనూ సోదాలు జరిగాయి. విరసం (విప్లవ రచయితల సంఘం) నాయకుడు జి. కళ్యాణ్‌రావు నివాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు.
మావోయిస్టులతో సంబంధాలున్న గుర్తుతెలియని వ్యక్తులు శిరీష నివాసంలో తలదాచుకుని ఉండొచ్చన్న అనుమానంతో ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్లపై శిరీష స్పందించారు. తన భర్త చనిపోయిన బాధలో ఉండగానే సోదాల పేరుతో తనను వేధిస్తున్నారని ఆరోపించారు. 'నేను ఎలాంటి నేరం చేయలేదు. నేరాలు చేసిన వారు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు.' అని శిరీష అన్నారు.