Ex Maoists 3rd PG : మూడో పీజీ పూర్తి చేసిన మాజీ మావోయిస్టు….
హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ మావోయిస్టు మూడో పీజీ పూర్తి చేసుకున్న ఘటన చర్లపల్లి జైల్లో జరిగింది. 27ఏళ్లుగా ఖైదీగా ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ డిగ్రీని ఇటీవల అందుకున్నారు.
ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ మావోయిస్టు పిబివి గణేష్ మూడో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. చదువుకునే వయసులోనే గెరిల్లా పోరాటంలోకి వెళ్లి హత్య కేసులో చిక్కుకున్న గణేష్ 56ఏళ్ల వయసులో మూడో పీజీ పూర్తి చేసుకున్నారు. చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న గణేష్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి మూడో పీజీ పూర్తి చేశారు.
1995లో జరిగిన ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి జైల్లోనే ఉంటున్న గణేష్ సైకాలజీలో పీజీ పూర్తి చేశారు. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో ఆయన ఇప్పటికే రెండు పీజీలు పూర్తి చేశారు. దాదాపు 27ఏళ్ళుగా జైల్లో ఉంటున్న గణేష్ కుటుంబంతో గడపాలని అకాంక్షను వ్యక్తం చేశాడు. తనను విడిచిపెడితే పొలిటికల్ సైన్స్ లేకుంటే సైకాలజీలో డాక్టరేట్ చేస్తానని చెబుతున్నారు. హత్య కేసులో చిక్కుకునే సమయానికి గణేష్ వయసు 27ఏళ్లు. బిఎస్సీ పూర్తి చేసిన తర్వాత గెరిల్లా పోరాటంలోకి వెళ్లిపోయారు. సగం జీవితాన్ని జైల్లోనే గడిపిన గణేష్ యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా భార్యను కలుసుకున్నారు. చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న చాలామంది ఖైదీలు బిఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ నుంచి పట్టాలు అందుకున్నారు.
గణేష్‌తో పాటు మరికొందరు కూడా చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ చదువు పూర్తి చేశారు. ఉన్నత విద్యా వంతుల కుటుంబానికి చెందిన 38ఏళ్ల అమీర్ మహ్మద్ జమాల్ కూడా సైకాలజీలో పీజీ పూర్తి చేసుకున్నారు. బిటెక్ పూర్తి చేసి పలు సంస్థల్లో పనిచేసిన జమాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. పిహెచ్ పూర్తి చేయాలనే తన తండ్రి అకాంక్షను నెరవేర్చాలని జమాల్ భావిస్తున్నారు.చిన్న వయసులో జైలుకు వచ్చిన చాలామంది జైల్లోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ సహకరిస్తోంది.
2018లో ఖైదీల కోసం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును అందుబాటులోకి తీసుకు వచ్చారు. అప్పటి జైళ్ల శాఖ డైరెక్టర్ వి.కె.సింగ్ జైల్లోనే పూర్తి స్థాయి సైకాలజీ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. ఖైదీల మనస్తత్వాలను అధ్యయనం చేసేందుకు అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి 26మంది సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలను పూర్తి చేసుకున్నారు. ఇతర జైళ్లలో ఉంటూ చదువుకునే వారిని కూడా చర్లపల్లికి తరలించి కోర్సు పూర్తి చేసేలా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్ధులు పీజీలు పూర్తి చేసుకున్నట్లు కోర్సు కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ బీనా చెప్పారు.