Mulugu Encounter : ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ.. పోలీసులకు కీలక ఆదేశాలు
03 December 2024, 14:56 IST
- Mulugu Encounter : ములుగు ఎన్‌కౌంటర్ తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్లింది. తాజాగా.. ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అటు ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ములుగు ఎన్‌కౌంటర్
ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. రీ పోస్ట్‌మార్టం నిర్వహించేలా.. ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. దీంతో నిబంధనల మేరకే నడుచుకున్నామని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ఇతర మావోయిస్టుల కుటుంబ సభ్యులకు.. అభ్యంతరంలేకపోతే మృతదేహాలు వారికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 5కు వాయిదా వేసింది.
అనుమానాలున్నాయి..
'ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి. ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ కూడా ఎన్‌కౌంటర్లకు ఒప్పుకోలేదు. మా ఆదివాసీలను ఎక్కువగా చంపుతున్నారని.. దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని దానిపై కోర్టులో పిటిషన్ వేశామని.. ఆదివాసి హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థిలో ఎన్‌కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 14 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిపై ఎవరికి అనుమానాలు ఉన్నా విచారణ చేయాల్సిన అవసరం ఉంది' అని మాజీమంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది. ఏకంగా ఏడుగురు మావోయిస్టులు పోలీస్ బలగాల చేతిలో హతమయ్యారు. ఆదివారం తెల్లవారకముందే.. పచ్చని అడవుల్లో తుపాకీ తూటాలు గర్జించాయి. మావోయిస్టుల శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. ఏటూరునాగారం మండలం చల్పాక పంచాయతీ పోలకమ్మ వాగు అటవీ ప్రాంతం పుల్లెల తోగు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
శనివారం సాయంత్రం 6 గంటలకు గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ కోసం పోలకమ్మ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున 5:30 గంటల నుంచి 6:18 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 7:10 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఉదయం 10:33 గంటలకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లారు.
మధ్యాహ్నం 2:10 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి ఎస్పీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. రాత్రి 11:35 గంటలకు మావోయిస్టుల మృతదేహాలను ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి వరకు ప్రత్యేక పోలీసు బలగాలు సుమారు 300 మంది అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాలకు ముందే మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 8వ తేదీ వరకు వారోత్సవాలను జరిపేందుకు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది.