Bhadradri Kothagudem : బీరు సీసాలో మందుపాతర.. భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టుల ప్లాన్!
Bhadradri Kothagudem : తమను వేటాడుతున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బీరు సీసాలో మందుపాతరను అమర్చారు. భద్రతా బలగాలు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. పూసుగుప్ప అడవుల్లో ఈ ఘటన జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లాన్ వేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా బీరు సీసాలో మందుపాతలను అమర్చారు. మూడుచోట్ల అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించాయి. బీరు సీసాల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) లను అమర్చారు. సీఆర్పీఎఫ్-81 బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో ఇవి కనిపించాయి. వీటిని జాగ్రత్తగా వెలికితీసి పేల్చేశారు. స్థానిక సీఐ రాజువర్మ వీటి గురించి భద్రతా బలగాలతో చర్చించారు.
మావోయిస్టులపై దాడులతోపాటు.. లొంగుబాటును ప్రోత్సహించేందుకు కేంద్రం ఆలోచన చేస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అండుగులు వేస్తోంది. ఇందుకు ఉమ్మడి ఏపీలో అనుసరించిన విధానాలపై అధ్యయం చేయించే యోచన కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిగాయి.
ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లోనే..
గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యాకలాపాలు సాగేవి. కానీ.. ప్రస్తుతం ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లోనే వీరి ఉనికి గట్టిగా ఉన్నట్టు కేంద్రం ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఛత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేట కొనసాగిస్తున్నాయి.
230 మంది మృతి..
దండకారణ్యంలో భద్రతా బలగాలు ఇప్పటికే 47 క్యాంపులు ఏర్పాటు చేశాయి. మరో 16 క్యాంపులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్యాంపుల ద్వారా జరిపిన ఆపరేషన్లలో ఇప్పటివరకు 230 మంది మావోయిస్టులు చనిపోయారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది లొంగిపోయారు. ఈ ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా 1765 మంది మావోయిస్టులు తగ్గిపోయారు.
మిగిలిన వారు తక్కువే..
ఒక్క ఏడాదిలోనే 1765 మంది బలం తగ్గడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయని తెలుస్తోంది. అయితే.. కేవలం దండకారణ్యంలో మాత్రం వీరి కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈజీగా వారిపై పైచేయి సాధించవచ్చనే అభిప్రాయంలో భద్రతా బలగాలు ఉన్నాయి. అందుకే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. వీరిని ఎదుర్కొవడానికి మావోయిస్టులు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.