Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం
03 September 2024, 11:50 IST
- Telangana Employees : తెలంగాణను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు. వరద బాధితులకు సహాయంగా.. ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జేఏసీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వీ.లచ్చిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రూ.100 కోట్ల విరాళాలు ప్రభుత్వానికి అందజేయనున్నట్టు లచ్చిరెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రముఖుల విరాళాలు..
తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విశ్వక్‌సేన్ విరాళం ప్రకటించారు.
గోదావరి ఉధృతి..
భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ముంపు గ్రామాల్లోని గర్భిణులు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఖమ్మంలోనే రేవంత్..
సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మంలోనే ఉన్నారు. గంగారం తండాకు వరదల్లో మృతిచెందిన మోతీలాల్..అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం మహబూబాబాద్‌లో పర్యటించనున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆకేరు వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి పరిశీలించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి.. వరద నివారణ చర్యలపై సమీక్షించనున్నారు.
అధికారులు అలెర్ట్‌గా ఉండాలి..
తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న రేవంత్.. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలని ఆదేశించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదికఇవ్వాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.