Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. 21 మందిని బలి తీసుకున్న వరదలు..-21 people died due to heavy rains and floods in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. 21 మందిని బలి తీసుకున్న వరదలు..

Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. 21 మందిని బలి తీసుకున్న వరదలు..

Basani Shiva Kumar HT Telugu
Sep 03, 2024 08:04 AM IST

Telangana Rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు.. వాటి వల్ల వచ్చిన వరదలు 21 మందిని బలి తీసుకున్నాయి. భారీగా అస్తి నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు.

వరదల్లో లభ్యమైన మృతదేహాన్ని బయటకు తెస్తున్న పోలీసులు
వరదల్లో లభ్యమైన మృతదేహాన్ని బయటకు తెస్తున్న పోలీసులు

శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో 21 మంది మృతిచెందారు. ఆదివారం వరకు వరదల్లో గల్లంతై 15 మంది మరణించగా.. సోమవారం సాయంత్రానికి మృతుల సంఖ్య 21కి చేరింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ ఏరియాలో భారీ వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి సంభవించింది. ఇంకా కొందరు వరదల్లో గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభ్యం కాలేదు.

ఇవాళ కూడా..

మంగళవారం కూడా.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

మరో మూడు రోజులు..

తెలంగాణ మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

స్కూళ్లకు సెలవు..

భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం నాడు.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సెలవు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

తక్షణ సాయంగా..

ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరదలతో రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగి నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ప్రతీ కుటుంబానికి నిత్యవసరాలు అందించాలన్నారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఖమ్మం వెళ్లే మార్గమధ్యలో దెబ్బతిన్న పాలేరు లెఫ్ట్ కెనాల్, దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు.