Group 1 Free Coaching : 5 వేల స్టైఫండ్ తో పాటు గ్రూప్ 1 మెయిన్స్‌కు ఫ్రీ కోచింగ్
20 January 2023, 9:16 IST
- Group 1 Main Exams: గ్రూప్ 1 మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐదు వేల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు ఓ ప్రకనలో పేర్కొన్నారు.
ఉచితంగా కోచింగ్
Telangana BC Study Circles Provide Free Coaching: తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు వచ్చేశాయి. కీలకమైన గ్రూప్ 1, 2, 3తో పాటు 4 ప్రకటనలు కూడా రావటంతో ఉద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్ పై ఫోకస్ పెంచుతున్నారు. కోచింగ్ సెంటర్లకు భారీగా వెళ్తున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రాగ... మెయిన్స్ నిర్వహణ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్‌కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం స్టడీ సర్కిళ్లలో దరఖాస్తు చేసుకోవాలని మెరిట్ ఆధారంగా శిక్షణ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5వేల చొప్పున మూడునెలల పాటు ఉపకారవేతనం సైతం అందివ్వనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వరంగల్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 చొప్పున, హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో 200 మందికి మొత్తంగా 400 మందికి మెయిన్ పరీక్షకు శిక్షణకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 182 మంది గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించడంపై స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్‌కుమార్ గురువారం హర్షం వ్యక్తం చేశారు.
Telangana Group 1 Results: ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు 25,050 మంది ఎంపికయ్యారు. మెయిన్స్ పరీక్షలు జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు స్పష్టం చేసింది.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీ ని విడుదల చేసింది సర్వీస్ కమిషన్. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగించింది. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించి, ఫలితాలను విడుదల చేసింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది.