TS Group 1 Prelims Results:గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. జూన్‌లో మెయిన్స్
TSPSC Group 1 Results: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలను ప్రకటించింది. మొత్తం 25,050 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.
Telangana Group 1 Results: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు 25,050 మందిని ఎంపికైనట్లు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు స్పష్టం చేసింంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీ ని విడుదల చేసింది సర్వీస్ కమిషన్. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగించింది. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించి, ఫలితాలను విడుదల చేసింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది. అర్హత పొందిన వారి హాల్ టికెట్ వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ జాబితాలో చెక్ చేసుకోవచ్చు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలనుhttps://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. ఇదిలా ఉంటే మరోవైపు పలు ఉద్యోగాల భర్తీకి వరుస ప్రకటనలు జారీ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో గ్రూప్ 2, 3, 4 తో పాటు పలు శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయనుంది. రవాణ శాఖలోని అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు ఫిబ్రవరి 1ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.