TSPSC Notifications : తెలంగాణలో కొలువుల జాతర.. మరో 4 నోటిఫికేషన్లు జారీ-tspsc issues four notifications in various departments as a part of jumbo recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Notifications : తెలంగాణలో కొలువుల జాతర.. మరో 4 నోటిఫికేషన్లు జారీ

TSPSC Notifications : తెలంగాణలో కొలువుల జాతర.. మరో 4 నోటిఫికేషన్లు జారీ

HT Telugu Desk HT Telugu
Dec 31, 2022 10:22 PM IST

TSPSC Notifications : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మరో 4 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. మొత్తం 955 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

టీఎస్సీఎస్సీ నోటిఫికేషన్లు
టీఎస్సీఎస్సీ నోటిఫికేషన్లు

TSPSC Notifications: తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ నిరుద్యోగులను ఖుషీ చేస్తూ.. సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా.. మరో 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. కళాశాల విద్యాశాఖ పరిధిలో 544 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. విద్యాశాఖ పరిధిలోనే 142 పోస్టులతో మరో నోటిఫికేషన్ వెలువరించింది. పురపాలక శాఖలో 156 ఖాళీలు భర్తీ చేసేందుకు ఇంకో ప్రకటన జారీ చేసింది. గతంలోనే విడుదలై పలు వివాదాల కారణంగా రద్దయిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా.. వరస నోటిఫికేషన్లతో.. ఆశావాహుల న్యూ ఇయర్ సంబరాలను రెట్టింపు చేసింది టీఎస్పీఎస్సీ.

కళాశాల విద్యాశాఖ..

కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మే లేదా జూన్ లో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

విద్యాశాఖ లైబ్రేరియన్ పోస్టులు...

విద్యాశాఖలోనే మరో 142 పోస్టులతో ఇంకో నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 71 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు... సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ ఖాళీలు ఉన్నాయి. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని... రిక్రూట్మెంట్ ఎగ్జామ్ మే లేదా జూన్‌లో ఉంటుందని వెల్లడించింది.

పురపాలక శాఖలో..

పురపాలక శాఖలో 156 ఖాళీలు భర్తీ చేసేందుకు ఇంకో ప్రకటన జారీ చేసింది టీఎస్పీఎస్సీ. 78 అకౌంట్ ఆఫీసర్.. 64 సీనియర్ అకౌంటెంట్... 13 జూనియర్ అకౌంటెంట్... 1 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది.

గతంలోనే విడుదలై పలు వివాదాల కారణంగా రద్దయిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు మరో సారి నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. రవాణా శాఖ పరిధిలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని.... మే లేదా జూన్‌లో ఏఎంవీఐ నియామక పరీక్ష జరుగుతుందని వెల్లడించింది.

2022 లోనే ప్రధాన నోటిఫికేషన్లన్నీ జారీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ డిసెంబర్ 1న గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ప్రకటించిన 9,168 ఖాళీలు కాకుండా.. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో 8,039 ఖాళీలనే భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 29న గ్రూప్ - 2 నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 శాఖల్లో 783 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

Whats_app_banner