తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Paper Leak Case : తెరపైకి కొత్త పేర్లు... 42 మంది Tspsc ఉద్యోగులకు సిట్‌ నోటీసులు!

Paper Leak Case : తెరపైకి కొత్త పేర్లు... 42 మంది TSPSC ఉద్యోగులకు సిట్‌ నోటీసులు!

HT Telugu Desk HT Telugu

22 March 2023, 19:32 IST

google News
  • TSPSC Papers Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కమిషన్ లో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ అయ్యాయి.  

పేపర్ లీక్ కేసులో నోటీసులు
పేపర్ లీక్ కేసులో నోటీసులు

పేపర్ లీక్ కేసులో నోటీసులు

TSPSC Papers Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణ వేగవంతం చేయటంతో... కీలక సమాచారం బయటికి వస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్… మిగతా వారిని విచారించే పనిలో పడింది. ఇదిలా ఉంటే.. ఈ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి నోటీసులు ఇచ్చింది సిట్. అయితే వీరంతా పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్నవారే అని తెలుస్తోంది.

బుధవారం సిట్ వీరందరికీ నోటీసులు ఇవ్వగా... రేపోమాపో విచారించనుంది. ఇందులో ఎక్కువ మంది టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి... వాట్సాప్‌ ఛాటింగ్‌, కాల్‌ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది సిట్. ఈ ఆధారాలను బట్టి.. రాజశేఖర్‌ టీఎస్‌పీఎస్సీ నుంచి పేపర్‌ తీసుకెళ్లి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించింది. అయితే సురేశ్ కూడా పేపర్‌ను లీక్‌ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్‌ ఇచ్చాడు? అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఇక ఈ కేసుకు సంబంధించి… గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పరీక్షలు రాశారు. వీరిలో కొందరికి 100కు పైగా మార్కులు వచ్చాయి. ఉద్యోగాలు చేస్తూ పరీక్షలు 100మార్కులు సాధించడంపై దృష్టి సారించారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.

పేపర్ లీకేజీ వెనక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ఫోన్‌లో మాట్లాడిన వారి చిరునామాలు సేకరించిన సిట్.. అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి విచారిస్తోంది. నిందితుల వెనక ఎవరున్నారనే వివరాలు ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మిని సిట్‌ పోలీసులు విచారించారు. ప్రశ్నపత్రాలను కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు కమిషన్‌లోని ఆమె కంప్యూటర్‌ను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను శంకరలక్ష్మి డైరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. డైరీలో తాను ఎలాంటి యూజర్‌ఐడీ, ఐడీ రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్‌ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. రెండోసారి ఆమెను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సుమారు గంటపాటు ప్రశ్నించి ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టారు.

ఈ నేపథ్యంలో… తాజాగా 40 మందికిపైగా సిట్ నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. పక్కా ఆధారాలు దొరకటంతోనే వీరందరికీ నోటీసులు ఇచ్చారా..? వీరిలో ఏఏ పరీక్షలు రాశారు..? ఎంత మంది అర్హత సాధించారు..? పేపర్ లీక్ కేసులో పాత్ర ఉందా…? వంటి కోణాల్లో విచారించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కీలక సమాచారం బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

తదుపరి వ్యాసం