TSPSC Xerox Centre: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట పోస్టర్ల కలకలం
TSPSC Xerox: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు టిఎస్‌పిఎస్సీ కార్యాలయం ఎదుట పోస్టర్లను అంటించారు. జిరాక్స్ కార్యాలయమంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి పోస్టర్లను అతికించారు.

TSPSC Xerox: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రములు లభించును అంటూ పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ సభ్యులు పోస్టర్లు అతికించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై పోస్టర్లు వెలిశాయి. టిఎస్‌పిఎస్సీ కార్యాలయాన్ని జిరాక్స్ కార్యాలయంగా పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఇది జిరాక్స్ సెంటర్ ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ ప్రశ్నా పత్రాలు లభించును అంటూ గోడ పత్రాలను అతికించారు.
తప్పు చేసిన టిఎస్‌పిఎస్సీ బోర్డును రద్దు చేయకుండా ప్రవేశ పరీక్షల్ని మాత్రమే రద్దు చేయడం ఏమిటని పోస్టర్లలో ప్రశ్నించారు.ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి తక్షణమే తెలంగాణ విద్యార్దులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని చెప్పడానికి వెంటనే సిబిఐకి విచారణ అప్పగించాలని డిమాండ్ చేశారు. టిఎస్‌పిఎస్సీ బోర్డును రద్దు చేయడంతో పాటు సంబంధిత శాఖ మంత్రిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రవేశ పరీక్షల్ని రద్దు చేయడయంతో నష్టపోయిన విద్యార్ధులకు మళ్లీ పరీక్షలు నిర్వహించే వరకు నెలకు రూ.10వేల రుపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీడిమాండ్ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రాజకీయ పార్టీలతో పాటు ఓయూ జేఏసీ సైతం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను జిరాక్స్ కార్యాలయంగా అభివర్ణించడం దుమారం రేగుతోంది.
కమిషన్ కార్యాలయం నుంచే ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగులే పేపర్ లీక్ ఉదంతంలో నిందితులుగా గుర్తించారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల్లో మెరుగైన మార్కులు వచ్చినట్లు గుర్తించారు. వీరంతా కమిషనర్ అనుమతితో పరీక్షలకు హాజరైనా చాలామందికి వందకు పైగా మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కమిషన్ పనితీరుకు అద్దం పట్టేలా జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి.