Siddipet Crime : ములుగులో డ్రగ్స్ కిట్లతో టెస్ట్, స్పాట్ లోనే ఇద్దరి అరెస్టు
24 August 2024, 19:25 IST
- Siddipet Crime : సిద్దిపేట జిల్లా ములుగులో గంజాయి సేవించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షించి ఇద్దరు యువకులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 100 నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ కిట్లు పంపిణీ చేశామని పోలీసులు తెలిపారు.
ములుగులో డ్రగ్స్ కిట్లతో టెస్టింగ్, స్పాట్ లోనే ఇద్దరి అరెస్టు
Siddipet Crime : డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెరిగిన తర్వాత మందుబాబులు మద్యం సేవించి వాహనాలు నడపాలంటేనే హడలిపోతున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి, మందు సేవించినట్టు ఆ పరీక్షలో తేలితే కఠిన చర్యలు తీసుకోవటంతో, మద్యం సేవించి వాహనాలు నడపటం చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు నిషేదించిన గంజాయి, ఇతర డ్రగ్స్ సేవించినట్టు కనపడితే, పోలీసులు పరీక్షించి వెంటనే అరెస్ట్ చేయటం మొదలు పెట్టారు. ఇలాంటి సంఘటన మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాలో నమోదయ్యింది.
గంజాయి తాగిన ఇద్దరు యువకుల అరెస్ట్
సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గంజాయి తాగిన ఇద్దరు యువకులను, పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి వ్యక్తులపై టెస్టింగ్ నిర్వహించి జిల్లాలో మొదటి కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. ములుగు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని సమాచారం రాగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఎలాంటి మద్యం దొరకలేదు వారి ప్రవర్తనలో అనుమానం వచ్చి నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లతో టెస్ట్ చేయగా గంజాయి సేవించినట్లు రిపోర్టు రాగానే ఇద్దరు నిందితులు గంగబోయి స్వామి తండ్రి నర్సింలు(23), యు.సురేష్(22) లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ కూడా ములుగు గ్రామస్తులే.
సిద్దిపేటకు వంద మిషన్లు
ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ కిట్లు జిల్లా వ్యాప్తంగా 100 పంపిణీ చేశామన్నారు. అధికారులు సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించాలని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు.
మాదకద్రవ్యాలు తీసుకుంటే ఉపేక్షించం-కమిషనర్
గ్రామాలలో పట్టణాలలో యువతి యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు, గురువుల చెప్పిన మాటలు విని చదువులో ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. మాదకద్రవ్యాల విషయంలో ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కోసం అందరూ కృషి చేయాలని సూచించారు.