Attack On Doctor : మహిళా డాక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న రోగి, అతని బంధువుల దాడి-woman doctor assaulted by drunk patient at mumbai sion hospital details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Attack On Doctor : మహిళా డాక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న రోగి, అతని బంధువుల దాడి

Attack On Doctor : మహిళా డాక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న రోగి, అతని బంధువుల దాడి

Anand Sai HT Telugu
Aug 18, 2024 06:18 PM IST

Women Doctor : కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో ఓ మహిళా డాక్టర్‌పై తాగి వచ్చిన రోగి, అతడి బంధువులు దాడి చేశారు.

మహిళా వైద్యురాలిపై దాడి
మహిళా వైద్యురాలిపై దాడి (Unsplash)

ఆదివారం ఉదయం ముంబైలోని సియోన్ హాస్పిటల్‌లో ఒక మహిళా రెసిడెంట్ డాక్టర్‌పై మద్యం మత్తులో ఉన్న రోగి, అతని బంధువులు దాడి చేశారు. కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది.

ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో డాక్టర్ వార్డులో డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. రోగి ముఖంపై గాయాలతో సియన్స్ లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌కు వచ్చాడు. అతడు చికిత్స చేస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రోగి బంధువుల బృందం డాక్టర్‌ను దుర్భాషలాడింది. ఆమెను బెదిరించి శారీరకంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. తనను తాను రక్షించుకునే క్రమంలో వైద్యురాలికి గాయాలయ్యాయి. ఘటన తర్వాత రోగి, అతడి బంధువు ఆసుపత్రి నుండి పారిపోయారు. ఈ ఘటనపై మహిళా డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక రోగి, అతని బంధువులు కొందరు మద్యం మత్తులో ఆసుపత్రికి చేరుకున్నారు. మహిళా రెసిడెంట్ డాక్టర్‌తో గొడవ పడ్డారు. ముంబైలో ఇలా జరగడం చాలా ఆందోళన కలిగించే విషయం.' అని డాక్టర్ అక్షయ్ మోర్ తెలిపారు.

సియోన్ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్ BMC MARD వైద్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా శ్రద్ధ అవసరమని చెప్పారు. అన్ని ఆసుపత్రులలో కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయడం అవసరమని పేర్కొన్నారు.

ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై అత్యాచారం హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆగ్రహం మధ్య ఈ సంఘటన జరిగింది.