Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు-supreme court takes suo motu cognizance of kolkata doctor rape murder case hearing on tuesday details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

Anand Sai HT Telugu
Aug 18, 2024 06:18 PM IST

Kolkata Doctor Case : కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 19(మంగళవారం)న విచారణ చేయనుంది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది.

ప్రజల ఒత్తిడి పెరగడం, రాష్ట్ర అధికారులు తప్పుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. భారతదేశంలోని వైద్య నిపుణుల భద్రత గురించి, ముఖ్యంగా మహిళల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది.

బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఆసుపత్రి సెమినార్ హాల్‌లో దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ నేరానికి సంబంధించి ఆసుపత్రిలో ఉన్న సంజయ్ రాయ్ అనే వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది సామూహిక అత్యాచారం అని బాధితురాలి కుటుంబం, నిరసనకారులు ఆరోపిస్తున్నారు. నిందితులందరికీ న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరణానికి ముందు బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని శవపరీక్షలో నిర్ధారించారు.

వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. శనివారం IMA దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేసింది. కిందటి బుధవారం రాత్రి కోల్‌కతాలో దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు వీధుల్లో నిరసన తెలిపారు. రీక్లెయిమ్ ది నైట్ మార్చ్‌లలో పాల్గొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు అత్యాచారం హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ మానసిక స్థితిని సీబీఐ పరిశీలిస్తోంది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి మానసిక నిపుణుల బృందం అవసరమైన పరీక్షలను నిర్వహించడానికి కోల్‌కతాకు చేరుకుంది. మహిళా డాక్టర్ కేసును విచారిస్తున్న సీబీఐ బృందం ఆగస్టు 18న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో 3డి లేజర్ మ్యాపింగ్‌ను నిర్వహిస్తోంది.

ఇంకోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారణలో జాప్యం చేసి చేశారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి గురించి పుకార్లు వ్యాప్తి చేసి, ఆ మహిళ గుర్తింపును వెల్లడించినందుకు బీజేపీ మాజీ ఎంపి లాకెట్ ఛటర్జీ, ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోల్‌కతా పోలీసులు సమన్లు ​​జారీ చేశారు.