Kolkata rape case : కోల్​కతా వైద్యురాలి హత్య.. ఆ సెమినార్​ హాల్​లో జరగలేదా?-kolkata rape murder case colleagues may be involved doctors father tells cbi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Rape Case : కోల్​కతా వైద్యురాలి హత్య.. ఆ సెమినార్​ హాల్​లో జరగలేదా?

Kolkata rape case : కోల్​కతా వైద్యురాలి హత్య.. ఆ సెమినార్​ హాల్​లో జరగలేదా?

Sharath Chitturi HT Telugu
Published Aug 18, 2024 06:40 AM IST

Kolkata doctor case : రేప్​, హత్యకు గురైన కోల్​కతా వైద్యురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​ సెమీనార్​ హాల్​లో ఆమె హత్యకు గురైందన్న వార్తలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పలు ఇతర కీలక విషయలను సైతం ప్రస్తావించారు.

వారణాసిలో కోల్​కతా వైద్యురాలి హత్యపై డాక్టర్ల నిరసనలు..
వారణాసిలో కోల్​కతా వైద్యురాలి హత్యపై డాక్టర్ల నిరసనలు.. (PTI)

కోల్​కతా వైద్యు రాలి అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​లోని సెమినార్​ హాల్​లో ఆమెను చంపినట్టు అధికారులు చెపడంపై అనుమానాలు వ్యక్తం చేశరు.

“మా బిడ్డను వేరే రూమ్​లో హత్య చేసి, సెమినార్​ హాల్​లోకి తీసుకొచ్చినట్టు అనుమానంగా ఉంది. కోల్​కతా పోలీసుల ప్రవర్తనలో నిర్లక్షం కనిపించింది. మా బిడ్డ అసలు సెమినార్​ హాల్​లోనే హత్యకు గురైందా? అని సందేహంగా ఉంది. వేరే చోట చంపి, అక్కడికి తీసుకెళ్లి ఉండొచ్చు అనిపిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐకి వివరించాము,” అని బాధిత కోల్​కతా వైద్యురాలి తండ్రి తెలిపారు.

కోల్​కతా డాక్టర్​ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను చెరిపేసేందుకు హాస్పిటల్​ థర్డ్​ ఫ్లోర్​లోని సెమినార్​ హాల్​ వద్ద మరమ్మత్తు చేస్తున్నారన్న ఆరోపణల మధ్య బాధితురాలి తండ్రి ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది.

తన కుమార్తె ఔట్ పేషెంట్ విభాగంలో (ఓపీడీ) విధులు నిర్వహిస్తోందని, ఉదయం 8.10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిందని, చివరిసారిగా రాత్రి 11.15 గంటల సమయంలో తల్లితో మాట్లాడిందని ఆయన చెప్పారు.

"ఆ రోజు ఉదయం 8.10 గంటలకు నా కూతురు డ్యూటీకి వెళ్లింది. ఓపీడీలో పనిచేస్తున్న ఆమె చివరిసారిగా రాత్రి 11.15 గంటల సమయంలో తన తల్లితో మాట్లాడింది. ఉదయం నా భార్య ఫోన్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ మోగింది, కానీ అప్పటికే నా కుమార్తె మరణించడంతో సమాధానం ఇవ్వలేదు," అని మృతురాలి తండ్రి వెల్లడించారు.

కోల్​కతా వైద్యురాలి హత్యపై నిరసన తెలుపుతున్న వారు నా సొంత బిడ్డల్లా ఉన్నారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

“నా కూతుళ్లల్లో ఒకరు చనిపోయారు. కానీ ఒక్కరి కోసం నా వేలాది మంది కూతుళ్లు, కొడుకులు ఈ రోజు వీధుల్లోకి చేరారు. బంగ్లాదేశ్​ నుంచి ప్రపంచం నలుమూలల వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మాకు న్యాయం జరగాలి,” అని కోల్​కతా వైద్యురాలి తండ్రి చెప్పుకొచ్చారు.

తమ కుమార్తె హత్యలో ఆసుపత్రికి చెందిన పలువురు ఇంటర్న్​లు, వైద్యుల ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు సీబీఐకి తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర సంస్థకు వారు అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లను కూడా అందించారు.

ఈ వ్యక్తులతో పాటు ప్రాథమిక దర్యాప్తులో పాల్గొన్న కోల్​కతా పోలీసు అధికారులను ప్రశ్నించడంపై ఏజెన్సీ దృష్టి సారించింది. హత్య జరిగిన రోజు రాత్రి వైద్యురాలితో పాటు డ్యూటీలో ఉన్న హౌస్ స్టాఫ్ మెంబర్, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలకు సీబీఐ శుక్రవారం సమన్లు జారీ చేసింది.

ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్​ను కూడా అధికారులు విచారణకు తీసుకెళ్లారు. మృతదేహం దొరికిన రెండు రోజుల తర్వాత రాజీనామా చేసిన డాక్టర్ ఘోష్ తన భద్రత గురించి భయపడ్డారు. దీంతో అతని న్యాయవాది కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్​ను ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది.

దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆసుపత్రి సెమినార్ హాల్​లో క్రైమ్ సీన్ రీకన్​స్ట్రక్షన్, త్రీడీ ట్రాకింగ్ నిర్వహించారు. ఆగస్టు 9న ఆర్​జీ కర్ హాస్పిటల్ సెమినార్ రూమ్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహాన్ని కనుగొనగా, మరుసటి రోజు అదే హాస్పిటల్​లో వాలంటీర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.