Visakhapatnam News : విశాఖలో మద్యం లోడు లారీ బోల్తా, ఎగబడ్డ మందుబాబులు-visakhapatnam news in telugu liquor bottles carrying lorry overturned people looted alcohol ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakhapatnam News : విశాఖలో మద్యం లోడు లారీ బోల్తా, ఎగబడ్డ మందుబాబులు

Visakhapatnam News : విశాఖలో మద్యం లోడు లారీ బోల్తా, ఎగబడ్డ మందుబాబులు

Bandaru Satyaprasad HT Telugu
Nov 11, 2023 05:44 PM IST

Visakhapatnam News : విశాఖలో మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు మద్యం బాటిల్స్ కోసం ఎగబడ్డారు.

మద్యం లారీ బోల్తా
మద్యం లారీ బోల్తా

Visakhapatnam News : రోడ్డుపై ఏదైనా వాహనం బోల్తా పడితే... ఎవరైనా గాయపడ్డారా? అని వారికి సాయం అందిస్తారు. సరుకు రవాణా వాహనాలు బోల్తా పడితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. విశాఖలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అసలే దీపావళి పండుగ... వరుసగా సెలవులు ఇంతకంటే మంచి తరుణం ఉండదు మద్యం ప్రియులకు. మందు చుక్క, చికెన్ ముక్కతో పండుగ కానిచ్చేందాం అని ప్లాన్ చేసుకుంటారు మందుబాబులు. అయితే విశాఖలో జరిగిన ఓ ఘటన మందుబాబులకు కలిసొచ్చింది.

విశాఖలోని మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. దీంతో ఉచిత మద్యం కోసం మందుబాబులు, స్థానికులు ఎగబడ్డారు. లారీ బోల్తా పడడంతో అందులోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు మందు, బీరు బాటిల్స్‌ కోసం పోటీ పడ్డారు.

మద్యం బాటిల్స్ కోసం ఎగబడ్డ స్థానికులు

మధురవాడ కొమ్మది వద్ద మద్యం లోడుతో వెళ్తోన్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న మద్యం సీసాల బాక్సులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. మద్యం లారీ బోల్తా కొట్టడడం గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు... రోడ్డుపై పడిన మద్యం బాటిల్స్ ను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. కొందరు మద్యం బాక్సులను సైతం పట్టుకెళ్లారు. లారీ డ్రైవర్ గాయపడ్డడా, అతనికి సాయం చేయాలనే ఆలోచన చేయని మందుబాబులు... ఉచితంగా మందు దొరుకుతుందని ఎగబడ్డారు. అయితే లారీ బోల్తా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చే లోపు లోడు ఖాళీ చేశారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.