తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mini Medaram Jatara : సిద్దిపేట మినీ మేడారం జాతరకు వేళాయె, 12 గ్రామాల్లో సంబరాలు ప్రారంభం

Mini Medaram Jatara : సిద్దిపేట మినీ మేడారం జాతరకు వేళాయె, 12 గ్రామాల్లో సంబరాలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

21 February 2024, 21:35 IST

google News
    • Mini Medaram Jatara : మేడారం జాతర ఎంతో ఘనంగా జరుగుతోంది. లక్షణాదిగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. అయితే మేడారం వెళ్లలేని భక్తులు మినీ మేడారం జాతర వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. సిద్దిపేటలోని 12 గ్రామాల్లో మినీ మేడారం జాతరలు జరుగుతుంటాయి.
మినీ మేడారం జాతర
మినీ మేడారం జాతర

మినీ మేడారం జాతర

Mini Medaram Jatara : మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma)తరహాలో సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల ఈ జాతర వైభవంగా నిర్వహిస్తారు. మేడారం జాతర(Medaram Jatara) వెళ్లలేని భక్తులు ఈ మినీ మేడారం జాతరలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని తమ తమ మొక్కులను చెల్లించుకుంటారు. రెండేళ్లకొకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు, సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలంలోని అక్కెనపల్లి గ్రామంలో సమ్మక్క ఆలయం ముస్తాబైంది. మేడారం తరహాలోనే ఈ జాతర 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటిరోజు సారలమ్మను, రెండోరోజు సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొనివచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం రోజు భక్తులు అమ్మవార్లకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది. ఇక్కడి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా గురు, శుక్ర రెండు రోజులు రాత్రి వేళల్లో ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అక్కెనపల్లిలోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మండలంలో కొమురవెల్లి కమాన్ దగ్గర, హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు దగ్గర, హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో, ధూళిమిట్ట మండలంలోని కూటీగాళ్ గ్రామంలో, చిన్నకోడూరు మెదలాలంలోని కిష్టాపూర్ గ్రామంలో, కోహెడ మండలంలోని పరివేద, వింజపల్లి, తంగళ్లపల్లి గ్రామలలో, బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, గుండారం, తోటపల్లి గ్రామాల్లో, అక్కన్నపేట్ మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో, ఇంకా చాలా గ్రామంలో కూడా మినీ మేడారం జాతరలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ప్రత్యేకంగా భక్తులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున ఈ జాతరలకు తరలివస్తారు. మేడారం జాతరలానే కోయ పూజారులతోనే ఈ పూజలను జరిపిస్తారు.

అక్కెనపల్లి మినీ మేడారం జాతర

నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయడంతో అక్కెనపల్లి గ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున సారలమ్మను గద్దెకు తీసుకురావడం, గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ జాతరలో భాగంగా శుక్రవారం రోజున భక్తులు ముడుపులు చెల్లించి, మొక్కులను తీర్చుకోనున్నారు. శనివారం రోజున అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు.జాతర ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళల్లో ఒగ్గు కథ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించునున్నట్లు తెలిపారు.

మేడారం వెళ్లలేని భక్తుల కోసం

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు అక్కెనపల్లి సమ్మక్క, సారక్క జాతర ఎంతగానో సౌకర్యార్థంగా ఉంటుంది. మేడారంలో జరిగే సమయానికే ఇక్కడ జాతరను నిర్వహించడంతో చాలా మంది భక్తులు ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు వారి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి, అమ్మవార్లకు ఓడి బియ్యం పోసి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మలను గద్దెల వద్దకు వచ్చే సమయంలో గ్రామస్థులు డప్పు, చెప్పులతో, శివసత్తుల పూనకలతో గద్దెల వరకు వచ్చి మొక్కులు తీర్చుకుని బంధువులతో కలిసి వేడుకగా జరుపుకుంటారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి సహాఫక్తి భోజనలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు.

జాతరకు బీజం పడింది ఇలా

నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివారులో గల పులిగుండ్ల సమీపంలో 40 సంవత్సరాల కిందట ఓ గొర్రెల కాపరి మేకలను మేపుతుండుగా పెద్ద గుండు ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయి. ఈ విషయం కాస్త గ్రామస్థులకు తెలియగానే అక్కడికి గ్రామస్థులందరూ తండోప తండాలుగా తరలి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర కొన్ని రోజుల ముందే ఈ ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయని, అమ్మవార్ల మహిమతోనే పసుపు, కుంకుమ కనిపించాయని, రెండెళ్లకోసారి గ్రామంలో జాతర జరిపించాలని పూనకం వచ్చిన ఓ మహిళ చెప్పింది. దీంతో ఆమె మాటలతో గ్రామస్థులకు నమ్మకం ఏర్పడింది. సమ్మక్క తల్లి పులి పైన స్వారీ చేస్తుందని అందుకే గ్రామంలోని పులిగుండ్ల వద్ద పసుపు రూపంగా దర్శన మిచ్చిందని గ్రామస్తులకు నమ్మకం కలిగింది. దీంతో గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఆ సమయంలో తలో కొంత చందాలు వేసుకోని పులిగుండ్ల సమీపంలో 14 ఎకరాల స్థలాన్ని సేకరించి, 1984లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి మేన కోడలు లక్ష్మి, పగిడిద్దరాజు (నాగుపాము) ప్రతిమలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో నిర్వహించే ముహూర్తానికి జాతరను నిర్వహించడం, సమ్మక్క, సారలమ్మలు గద్దనెక్కడం, భక్తులు మొక్కులు తీర్చుకోవడం అనవాయితీగా మారిపోయింది.

హెచ్.టి.తెలుగు రిపోర్టర్, సిద్దిపేట

తదుపరి వ్యాసం