తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara : కిక్కిరిసిన మేడారం, భారీగా ట్రాఫిక్​ జామ్-ఈ జిల్లాల్లో ఇసుక విక్రయాలు బంద్

Medaram Jatara : కిక్కిరిసిన మేడారం, భారీగా ట్రాఫిక్​ జామ్-ఈ జిల్లాల్లో ఇసుక విక్రయాలు బంద్

HT Telugu Desk HT Telugu

21 February 2024, 16:34 IST

google News
    • Medaram Jatara : మేడారం మహా జాతరకు భక్త జనం పోటెత్తారు. నేటి సాయంత్రం గద్దెపైకి సారలమ్మ చేరుకోనుండడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. మేడారం రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. 
కిక్కిరిసిన మేడారం
కిక్కిరిసిన మేడారం

కిక్కిరిసిన మేడారం

Medaram Jatara : మేడారం మహాజాతరకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. బుధవారం సాయంత్రం సారలమ్మ(Saralamma) గద్దెలకు చేరుకోనుండటంతో భక్తులు మొక్కులు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మేడారంలోని (Medaram Jatara)రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఓ వైపు వాహనాలను కంట్రోల్​చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా.. అక్కడ పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మేడారంలో ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటి రోజు, సారలమ్మ కూడా గద్దెలకు చేరుకోకున్నా భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో, ఇంకా తరలివస్తున్న వాహనాలతో జాతర ప్రాంగణంలో ట్రాఫిక్​ సమస్యలు(Medaram Traffic Jam) తీవ్రమయ్యే ప్రమాదం ఉండటంతో మంత్రి సీతక్క కీలక సూచనలు చేశారు. వీఐపీ, వీవీఐపీ వాహనాలను ములుగులో పార్కింగ్​ చేసి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మేడారం జాతర ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇసుక లారీలతో ట్రాఫిక్​ ఇబ్బందులు ఏర్పడకుండా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అధికారులు కూడా కీలక ప్రకటన చేశారు. ఇసుక లారీల వల్ల మేడారం రూట్ లో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఆ చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల పరిధిలో జాతర పూర్తయ్యేంత వరకు ఇసుక విక్రయాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జంపన్నవాగు రూట్​ లో గంటన్నరపాటు ట్రాఫిక్​ జామ్​​

గిరిజన జాతర మేడారానికి తరలివస్తున్న భక్తులతో అక్కడి పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. బుధవారం ఉదయం నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరిగిపోగా.. భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తల్లుల గద్దెలను దర్శించుకునేందుకు ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేయడం సంప్రదాయం కాగా.. జనాలు మొదట జంపన్న వాగుకు చేరుకుంటున్నారు. దీంతో జంపన్నవాగు రూట్​ మొత్తం జనంతో నిండిపోయింది. జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెలకు వెళ్లే మార్గంలో వాహనాలు, జనాల రాకపోకలపై నియంత్రణకు పోలీస్​ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ రూట్​ లో ఖాళీగా ఉన్న రెండు అంబులెన్స్​ లతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలు ట్రాఫిక్​ లో చిక్కుకున్నాయి. వాహనాలు కదలలేని పరిస్థితి ఉండగా దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్​ జామ్​ అలాగే కొనసాగింది. జంపన్నవాగుకు వచ్చే భక్తులతో పాటు ఇక్కడి నుంచి గద్దెలకు వెళ్లే జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ట్రాఫిక్​ ను కంట్రోల్​ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జనాలకు అవస్థలు తప్పలేదు. ఈ క్రమంలోనే ఆ మార్గం మొత్తం జనంతో కిక్కిరిసిపోవడంతో ఒక దశలో తోపులాట జరుగుతుందోమోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే రష్​లో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడగా.. ఎండ ప్రభావం వల్ల అక్కడి జనాలకు కష్టాలు తప్పలేదు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు ట్రాఫిక్​ ను క్లియర్​ చేయడంతో అంబులెన్స్​లు జనం నుంచి బయటకు వచ్చాయి. దీంతో రాకపోకలకు లైన్​ క్లియర్​ కావడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే తొక్కిసలాట జరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నాలుగు రోజులు ఇసుక విక్రయాల నిలిపివేత

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర(Medaram Jatara) దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు ఇసుక లోడింగ్(Sand Sales), ఆన్‌లైన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే విధంగా ఇతర జిల్లాలకు పరిమితిలో ఆన్‌లైన్‌లో అనుమతులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలన్న సీతక్క

మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగు వద్ద పార్కింగ్ చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆర్టీసీ బస్సుల దారిలో వీఐపీ వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వీవీఐపీలు, వీఐపీల పాసులను కట్టుదిట్టం చేశామని సీతక్క తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గద్దెల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంటుందని, భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క కోరారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం