Medaram Rush: మేడారంలో రష్తో ముందస్తు మొక్కులు ఎంతమంది పెట్టారో తెలుసా? భారీగా తరలి వస్తున్న భక్తులు
21 February 2024, 13:21 IST
- Medaram Rush: మేడారం ముందస్తు మొక్కుల్లో భాగంగా ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది అమ్మవారి గద్దెలను దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తులతో కిక్కిరిసిన మేడారం జాతర క్యూ లైన్లు
Medaram Rush: మేడారం అంటేనే జన జాతర. అడుగు తీసి అడుగుయాలంటే భుజం భుజం తాకుతుంటుంది. ఇసుకేస్తే రాలనంతా జనంతో కిక్కిరిసిపోతుంది. ఇక సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్లాలంటే మాత్రం భక్తులdevotees రద్దీతో చుక్కలు కనిపస్తాయి.
జాతర సమయంలో పిల్లా పాపలతో అమ్మవార్లను దర్శించుకుందామనుకున్న భక్తులు నానా అవస్థలు పడాల్సి వస్తుంటుంది. దీంతోనే చాలామంది భక్తులు ముందస్తు మొక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఏటికేడు ఇదే సంప్రదాయం ఎక్కువవుతుండటంతో ఈసారి కూడా ముందస్తు మొక్కులు పెట్టిన భక్తులు కూడా లక్షల్లోనే ఉన్నారు.
దాదాపు అర కోటి 50lacs మందికి పైగా భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేస్తుండగా.. అమ్మవార్లు గద్దెలకు చేరుకునే సమయంలో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
దాదాపు 60 లక్షల మంది కంప్లీట్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మేడారం మహాజాతరకు గుర్తింపు ఉండగా.. జాతర సమయంలో దాదాపు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కానీ ప్రతి సంవత్సరం జాతర జరిగే నాలుగు రోజుల పాటు మేడారం ప్రాంతమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దీంతోనే ఈసారి ముందస్తు మొక్కులకు జనాలు బారులు తీరారు. ఇలా మంగళవారం వరకు ముందస్తు మొక్కులు చెల్లించిన భక్తులపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
ముందస్తు మొక్కుల్లో భాగంగా ఇప్పటివరకు 58 లక్షల నుంచి 60 లక్షల మంది వరకు అమ్మవారి గద్దెలను దర్శించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి సీతక్క Minister seethakka కూడా ప్రకటించారు. ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మంది వరకు ముందస్తు మొక్కులు సమర్పించారని, మహాజాతర కోసం వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆదివారాలు, సెలవు దినాల్లో..
గత నెల రోజుల్లో వచ్చిన సెలవులు, పండుగ దినాల్లో ప్రజలు సమ్మక్క–సారలమ్మకు మొక్కులు పెట్టేందుకు తరలివచ్చారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే భక్తులు.. పిల్లాపాపలతో ముందస్తుగానే దర్శనాలు పూర్తి చేసుకున్నారు.
ముఖ్యంగా ఉద్యోగులకు ఆదివారాలతో పాటు సంక్రాంత్రి సెలవులు కూడా కలిసి వచ్చాయి. దీంతో గడిచిన నెల రోజుల్లో భక్తుల రాకతో మేడారం ఎప్పుడూ కిటకిటలాడుతూనే కనిపించింది. వాహనాల రాకపోకలు కూడా పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కూడా తలెత్తాయి.
తల్లులు గద్దెల మీదకు చేరుకున్న తరువాత భక్తుల తాకిడి ఎక్కువవుతుందనే ఉద్దేశంతో చాలామంది ముందస్తుకే మొగ్గు చూపారు. కుటుంబ సమేతంగా తల్లుల గద్దెలను తాక వచ్చనే భావనతో చాలామంది నెల రోజుల ముందు నుంచే మొక్కులు సమర్పించారు.
నాలుగు రోజుల్లో మరో రెండు కోట్లమంది
ముందస్తు మొక్కులు సమర్పించిన భక్తులే అరకోటికి పైగా ఉండగా.. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు వచ్చినప్పటి నుంచి సమ్మక్క ఆగమనం, తిరిగి అమ్మవార్ల వన ప్రవేశ ఘట్టం పూర్తయ్యేంత వరకు కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు టీఎస్ ఆర్టీసీ కూడా జాతరకు కొద్దిరోజుల ముందు నుంచే ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తుండటంతో పాటు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజుల్లో మరో రెండు కోట్ల మంది వరకు భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇంతపెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వ పరంగా రూ.105 కోట్ల నిధులతో ఏర్పాట్లు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా.. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు, సిబ్బంది అంతా కలిపి సుమారు 36 వేల మంది జాతర విధుల్లో నిమగ్నమయ్యారు.
కిక్కిరిస్తున్న ఆర్టీసీ బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరకు జనాలను తరలించడంలో ఆర్టీసీదే కీలక పాత్ర కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 51 బస్టాండ్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు ఆపరేట్ చేస్తోంది. మొన్నటి ఆదివారం ఉదయం నుంచే మేడారం స్పెషల్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించగా.. మేడారంలో ఆర్టీసీ సౌకర్యార్థం 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు.
మొత్తంగా 15 కిలోమీటర్ల పొడవు ఉండే 48 క్యూలైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. మేడారం వనదేవతల దర్శనానికి తరలివచ్చే భక్తుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారానే సుమారు 30 లక్షల మందికిపైగా రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)