Medaram Tourists: మేడారం జాతరకు వచ్చే పర్యాటకులకు షాక్.. లక్నవరం సందర్శనలకు బ్రేక్.. కారణం ఏమిటంటే?
Medaram Tourists: మేడారం జాతరకు వచ్చే పర్యాటకులకు ఈ సారి లక్నవరం సందర్శన కుదరదు. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో లక్నవరంకు సందర్శకుల అనుమతులు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Medaram Tourists: ఉమ్మడి వరంగల్Warangal జిల్లా పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. వరంగల్ నగరంలో చారిత్రక కట్టడాల నుంచి ములుగు, ఏటూరునాగరం అటవీ ప్రాంతాల్లోని అందాలన్నీ టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి.
బుధవారం నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. ఎంతోమంది భక్తులు సమ్మక్క–సారలమ్మను Sammakka saralamma దర్శించుకోవడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ముఖ్యంగా లక్నవరం Laknavaramసరస్సును సందర్శించేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతారు. కానీ మేడారం రూట్ లో కేరళ లాంటి అందాలు ఒదిగి ఉన్న ఈ అద్భుత సరస్సును సందర్శించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. అక్కడికి ఎవరూ వెళ్లవద్దంటూ ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ పెరిగిపోయిందనే కారణంతో
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు ఆహ్లాదానికి అడ్డాగా వెలుగొందుతోంది. ఓ కేరళ.. ఓ అరకు.. ఓ కోనసీమ.. ఇలా ప్రకృతి పరవళ్లు తొక్కే ఎన్నో అందాలు ఈ లక్నవరం సరస్సు చుట్టూ కనిపిస్తుంటాయి.
సరస్సులో బోటు షికారు, స్పీడ్ బోట్ తోపాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఏర్పాట్లుంటాయి. చుట్టూ ఉన్న కొండకోనలు, చెట్లు, నీళ్లు, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఈ మేరకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బుస్సాపూర్ గ్రామపంచాయతీ, టూరిజం డిపార్ట్ మెంట్ల సమక్షంలో ఇప్పటికే అక్కడ బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో వాహనాల రద్దీ భారీ స్థాయిలో పెరిగిందని, ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు కూడా తెలిపారు.
ఇందుకు మేడారం భక్తులు, పర్యాటకులు సహకరించాలని కోరారు. మేడారం జాతర ముగిసిన అనంతరం తిరిగి లక్నవరం సరస్సు సందర్శనకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు వాహనాలు లక్నవరం సరస్సు వద్దకు వెళ్లకుండా బుస్సాపూర్ క్రాస్ వద్ద బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
మిగతా వాటికి లైన్ క్లియర్..
ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ప్రముఖ పర్యాటక క్షేత్రమైన లక్నవరం సందర్శనను నిలిపివేయగా.. మిగతా ప్రాంతాల్లోని టూరిస్ట్ ప్లేసులకు మాత్రం ఎలాంటి నియంత్రణ లేదు. దీంతోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు భక్తులకు అవకాశం ఉంది.
ముఖ్యంగా వరంగల్ నగరంలో వేయి స్తంభాల గుడి, తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయం, చరిత్రకు ఆనవాళ్లుగా, కాకతీయుల వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్న ఓరుగల్లు కోట సందర్శకులను ప్రముఖంగా ఆకర్షిస్తాయి.
వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని సందర్శిస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. వరంగల్ మీదుగా ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఐలోని మల్లన్న క్షేత్రం కూడా తారసపడుతుంది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఇక్కడ గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం చాళుక్యుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇటువంటి నిర్మాణం చాళుక్యుల కాలానికే చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కూడా కనిపిస్తుంది. వరంగల్ కు సమీపంలోని మామునూరు నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే చాళుక్యుల నిర్మాణ వైభవం ఉట్టిపడే ఈ ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం కనిపిస్తుంది.
రామప్ప గుడి, కాళేశ్వరం కూడా..
వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన రామప్ప గుడి కూడా మేడారం రూట్ లోనే ఉంటుంది. రామప్ప ఆలయ నిర్మాణంలో కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడుతుంది. నీటిలో తేలియాడే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ గుడిని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
ఈ శివాలయాన్ని దైవంపేరుతో కాకుండా ఆలయ ప్రధాన శిల్పి ‘రామప్ప’ పేరుతో పిలుస్తుండటం విశేషం. కాగా మేడారం వెళ్లి, వచ్చే భక్తులకు ఈ ఆలయ సందర్శన అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మూడు నదులు కలిసే త్రివేణి సంగమం కూడా ఉంటుంది.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతి నది కలవడం వల్ల ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడింది. ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు కొద్దిదూరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన అన్నారం బ్యారేజీ కూడా ఉంది. అంతేగాకుండా తెలంగాణ రెండో యాదాద్రిగా పిలుచుకునే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా మేడారం రూట్ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది.
ములుగు జిల్లా బూర్గంపాడు, ఏటూరునాగారం దారిలో మంగపేట మండలం మల్లూరు గుట్టలపైన శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి వెలిశారు. ఇక్కడ గుట్టపై నుంచి చింతామణి అనే జలధార కాలంతో సంబంధం లేకుండా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. గుట్టలపైనుంచి జాలువారే ఈ నీళ్లు సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడతాయని భక్తుల విశ్వాసం.
ఇలాంటి ఎన్నో చారిత్రక నేపథ్యం ఉన్న పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మేడారం మార్గంలో వచ్చీ, పోయే భక్తులు అవకాశాన్ని బట్టి వీటిని సందర్శిస్తే మేడారం ట్రిప్ మరిచిపోలేని జ్ఞాపకంగా మారే ఛాన్స్ ఉంది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)