Medaram helicopter rides: మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు… నేరుగా హెలి రైడ్ బుకింగ్స్ చేసుకునే అవకాశం
Medaram helicopter rides: మేడారం భక్తులకు హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సరదాగా మేడారం జాతరను విహంగ వీక్షణం Heli tourచేయడంతో పాటు దూర ప్రాంతాల నుంచి నేరుగా జాతర జరిగే ప్రదేశానికి వెళ్లేందుకు కూడా వీలుంది.
Medaram helicopter rides: మరికొద్ది గంటల్లో తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తులకు హెలికాప్టర్ helicopter సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణలో జరిగే మేడారం జాతర కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా Kumbhamela గా ప్రత్యేక గుర్తింపు ఉంది.ఎక్కడెక్కడి నుంచో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు మేడారంకు తరలి వస్తుంటారు.
ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాఫ్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులో ఉంటాయి. హెలికాఫ్టర్‌లో వెళ్లే వారికి కోసం ప్రత్యేక దర్శనాల Special Entry కోసం ఏర్పాట్లు చేశారు.
మొక్కులు చెల్లించిన తర్వాత హనుమకొండకు తిరుగు ప్రయాణం ఉంటుంది. మేడారంలోనే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.
హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా VIP దర్శనాన్ని పొందవచ్చు. దీనికి ఒక్కొక్కరికి రూ. 28,999 చెల్లించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. కుటుంబం మొత్తం ఒకే ట్రిప్‌లో మేడారం వెళ్లడానికి బుక్ చేసుకోవచ్చు.
జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొద లయ్యే రైడ్ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది.దీని ద్వారా మేడారం జాతర ప్రదేశాన్ని విహంగ వీక్షణం చేయొచ్చు.
జాయ్ రైడ్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం 74834 33752, 04003 99999 నంబర్లలో సంప్రదించవచ్చు. infor@helitaxi.comలో ఆన్‌లైన్ లో సంప్రదించ వచ్చు.
జాతరకు సమీపిస్తున్న గడువు…
సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వన దేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను మంగళవారం మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు.
గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజాకార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు.
ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళతారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పదిమంది పూజారులు, పలువురు భక్తులు పగడిద్దరాజు వెంట బయలుదేరి వెళ్తారు.
మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద మంగళవారం రాత్రి విడిది కల్పిస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తారు.
సమ్మక్క తనయుడు, సారలమ్మ సోదరుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశస్థులు మేడారం తీసుకురానున్నారు. పూజారి పోలెబోయిన సత్యం ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. ఆ వెంటనే లక్షల మంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారని నిర్వాహకులు తెలిపారు.