Medaram Traffic : మేడారం మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు- ముందస్తు మొక్కులతో ఇప్పటి నుంచే ఇబ్బందులు-medaram news in telugu ways to medaram temple filled up with vehicles traffic jam issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Traffic : మేడారం మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు- ముందస్తు మొక్కులతో ఇప్పటి నుంచే ఇబ్బందులు

Medaram Traffic : మేడారం మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు- ముందస్తు మొక్కులతో ఇప్పటి నుంచే ఇబ్బందులు

HT Telugu Desk HT Telugu
Feb 12, 2024 09:49 AM IST

Medaram Traffic : మేడారం మహా జాతర ప్రారంభం కాకముందే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. మేడారం వెళ్లే మార్గాల్లో వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో పది రోజుల్లో మేడారం జాతర ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు
మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు

Medaram Traffic : మేడారం మహాజాతర ఇంకో పది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ముందస్తు మొక్కులతో మేడారం వనమంతా జనంతో నిండిపోతోంది. ఇప్పటి నుంచే మేడారం పరిసరాలన్నీ మహాజాతరను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలతో మేడారం దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే ఇంత పెద్ద జాతరకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చాలా ముఖ్యమైన అంశం. కానీ అసలు జాతర ప్రారంభం కాకముందు నుంచే మేడారం రోడ్లపై తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నాయి. వాహనాలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వాస్తవానికి మేడారం వచ్చీపోయే మార్గాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాల్సిన పోలీసులు.. లైట్ తీసుకోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పాడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముందస్తు మొక్కులతో ఫుల్ రష్

మేడారం.. కోట్లాది మంది తరలివచ్చే మహాజాతర. నాలుగు రోజులపాటు జాతర జరుగనుండగా.. ఆ నాలుగు రోజులు రోడ్ల మీద నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు.. ఇలా వివిధ రకాల వాహనాల్లో భక్తులు జాతరకు తరలివస్తుంటారు. దీంతో మహాజాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారం వచ్చీపోయే మార్గాలన్నీ వాహనాలతోనే నిండిపోయి ఉంటాయి. అందుకే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు వన్ వే మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతుంటారు. కానీ ఈసారి భక్తులు ముందస్తు మొక్కులతో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెకు వచ్చే రోజుల్లో లక్షలాది మందితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ముందస్తుగా మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక సెలవు దినాల్లో ఉద్యోగులు, పిల్లాపాపలతో కలిసి అమ్మవార్ల దర్శనానికి తరలుతున్నారు. దీంతో జాతరకు పది రోజుల ముందు నుంచే మేడారం కిక్కిరిసిపోతోంది.

కంట్రోల్ తప్పి ట్రాఫిక్ జామ్

మేడారం జాతరకు వచ్చే వాహనాలకు ఇప్పటి నుంచే ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. సరైన ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ లేక వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి ప్రతి జాతర సమయంలో ఎస్పీ, సీపీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా ట్రాఫిక్ కంట్రోల్ కోసం ట్రాఫిక్ ఇన్ ఛార్జ్ గా నియమించేవారు. మేడారం రోడ్లపై వాహనాల రాకపోకలు ఇబ్బందులు తలెత్తకుండా రూట్లు కేటాయించడంతో పాటు వన్ వేలు డిసైడ్ చేసి పక్కా ప్లాన్ అమలు చేయాలంటే ప్రత్యేకంగా ఒక సీనియర్ ఆఫీసర్ నిఘా తప్పనిసరి. ఆ అధికారి నిరంతరం మేడారం వాహనాలు రాకపోకలు సాగించే మార్గాల్లో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన హ్యాండోవర్ ఉండే సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసి, ట్రాఫిక్ చిక్కులు తప్పించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఈ మేరకు గత 2022 మహాజాతర సమయంలో అప్పుడు వరంగల్ సీపీగా ఉన్న తరుణ్ జోషికి, అంతకుముందు 2020 జాతర సమయంలో అప్పుడు వరంగల్ సీపీగా ఉన్న డా.విశ్వనాథ్ రవీందర్ కు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు ఆఫీసర్లూ ట్రాఫిక్ పై మంచి అవగాహన కలిగి ఉండటంతో పాటు వారం, పది రోజుల ముందే మేడారం రూట్ మ్యాప్ రిలీజ్ చేసి వాహనాలను నియంత్రించే పనులు చేపట్టారు. దీంతో వారు మేడారం ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. చిన్నాచితక ఇబ్బందులు ఏర్పడినా వెంటనే సాల్వ్ చేసేలా చర్యలు చేపట్టారు. కానీ ఈసారి పూర్తిస్థాయి ట్రాఫిక్ ఇన్ ఛార్జ్ గా ఎవరికీ బాధ్యతలు అప్పగించనట్టే తెలుస్తోంది. ఐజీ తరుణ్ జోషి జాతర పనులను పర్యవేక్షిస్తున్నా ఇప్పటి నుంచే ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం కలవరపెడుతోంది.

జాతర స్టార్ట్ అయితే పరిస్థితేంటి..?

మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుండగా.. అమ్మవార్లు గద్దెల మీదికి వచ్చే రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వాహనాల రాకపోకలు కూడా నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఆ స్థాయిలో వాహనాలు రాకపోయినా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండగా.. మహాజాతర ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందోననే సందేహాలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఇప్పటికే సెలవు దినాల్లో వాహనాల రద్దీ దృష్ట్యా రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతుండగా.. ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. జాకారం వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ కావడంతో ఆ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వాస్తవానికి మేడారం వాహనాలు వెళ్లే మార్గంలో అంతటి భారీ వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు. కానీ పోలీస్ ఆఫీసర్లు తేలిగ్గా తీసుకోవడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వినిపించాయి. దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో ములుగు ఎస్సై వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు అరగంటపాటు శ్రమించి వాహనాలను క్లియర్ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మేడారం జాతర ప్రారంభమైతే వాహనాదారులకు తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా మేడారం జాతరకు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ను నియమించడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని భక్తులు కోరుతున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం