Nagoba Jatara: ఆదివాసులు ఆరాధ్య దైవం... “నాగోబా”, తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర-all set for nagoba the second largest fair in telangana and india ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagoba Jatara: ఆదివాసులు ఆరాధ్య దైవం... “నాగోబా”, తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర

Nagoba Jatara: ఆదివాసులు ఆరాధ్య దైవం... “నాగోబా”, తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర

HT Telugu Desk HT Telugu
Feb 09, 2024 11:14 AM IST

Nagoba Jatara: ఆదివాసి జాతరలలో అతిపెద్ద రెండో జాతర, తెలంగాణలో ఆదివాసులు రెండో పెద్ద జాతరగా నాగోబా జాతరకు గుర్తింపు ఉంది.

నాగోబా జాతర నిర్వహణలో ఆదివాసీలు
నాగోబా జాతర నిర్వహణలో ఆదివాసీలు

Nagoba Jatara: ఆదివాసి గోండ్ తెగవారి యొక్క ఆరాధ్య దైవం నాగోబా జాతర అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య మాసంలో జరుగుతుంది. జాతరకి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గడ్ మహారాష్ట్ర, ఒడిస్సా మధ్యప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఆదివాసిలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

ఈ జాతరలో వివిధ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఆదివాసి పద్ధతిలో నిర్వహిస్తారు. ఆదివాసి తెగలు గోండ్ (పర్థాన్) లో గల మేస్రం వంశస్తుల యొక్క వంశదేవునిగా నాగోబా (సర్పం)న్ని ఆరాధిస్తారు. ఎంతో నియమనిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణా జరుపుతారు.

చరిత్ర....స్థల పురాణం ప్రకారం...

జాగ్దేవి మహాదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని శివుని ద్వారా వరం పొందుతుంది. ఈ వరంతో 12 సంవత్సరాలు ప్రతిరోజు నియమనిష్ఠలతో బేరులి (మర్రి వృక్షం) దగ్గర పాము పుట్టకి కలశం లేదా జార్‌తో ప్రతిరోజు జలాభిషేకం చేసి పూజిస్తుంది. ఫలితంగా జార్దేవ్‌కి భార్‌దేవ్ జన్మిస్తారు. భార్ దేవ్‌కి నాగమోతితో వివాహం జరిపిస్తుంది.

ఈ వివాహ కార్యక్రమాన్ని ఈరా సుఖ తాత పర్యవేక్షణలో జరుగుతుంది. వీరు నాగ బీడ్ ప్రాంతంలో స్థిరపడతారు. వారసత్వంగా వస్తున్నాం 'కలశం' 'జారీ' లేదా 'మురడి'ని తన కుమారుడైన జలకల్ దేవునికి అప్పగించి వీరు తండ్రి మాట ప్రకారం కేస్లాపూర్ గ్రామం వచ్చి గ్రామానికి పునాది వేసి అక్కడే స్థిరపడతారు.

వీరికి ఏడుగురు కుమారులు సంతానం ఉన్నారు. కేస్లాపూర్ లో పాడిపంటలు, వ్యవసాయం, పంటల అత్యంత దిగుబడితో ధన రాశులతో కలకలాడుతున్న సమయంలో కేస్లాపూర్ గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి.

దీనితో పంటలు, సంపద పూర్తిగా నాశనం అవుతుంది. ఇలాంటి సమయంలో తమ దైవం నాగోబా, పాము కేస్లాపూర్ గ్రామంలోకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం వల్ల దుష్టశక్తులు మాయమై మునుపటి పంటలు పశు సంపద సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది.

దీనికి ప్రతీకగానే ప్రతి సంవత్సరము గోండ్స్ పుష్య మాసంలో ప్రతి ఏడాది జలంతో నాగ దేవునికి అభిషేకం చేసి సాంప్రదాయ, సంగీత వాయిద్యాలతో ఆచార ప్రకారం ప్రతి ఏడాది జాతర జరుపుతున్నారు.

గోండ్స్ ఆదివాసులు తమ ఆచారం ప్రకారం ముందుగా 'చకడా’ (ఎడ్ల బండి)తో నాగోబా పీఠాధిపతి ఇంటి నుంచి బయలుదేరి తమ బంధువులు గోండ్ వారి గ్రామాలకి వెళ్లి ప్రచారం చేస్తూ పూజకు కావలసిన కుండలను సిరికొండ గ్రామంలో గల గుగ్గిళ్ళ వంశం వారికి తమ పూజకు కావలసిన మట్టికుండలా తయారు చేయమని చెప్పి కటోడ మరియు గాధే ప్రధాన్ తిరిగి పీఠాధిపతి ఇంటికి చేరుకుంటారు. దీనిని 'చందుర్ ధూప్' అని కూడా అంటారు.

కుండలతో జాతరకు బయల్దేరిన ఆదివాసీ మహిళలు
కుండలతో జాతరకు బయల్దేరిన ఆదివాసీ మహిళలు

అభిషేకజలం కోసం గోదావరి కి పాదయాత్ర....

నాగోబా పీఠాధిపతి మేస్రం వెంకట్రావు పటేల్ ఆవరణలో అందరూ హాజరై గత ఏడాది పెద్ద మట్టి కుండలో భద్రపరిచిన కలశాన్ని బయటికి తీసి, తొమ్మిది మీటర్ల తెల్లని వస్త్రం లో కలశాన్ని ఉ౦చి మూటకట్టి గత సంవత్సరం వాడిన పాత వెదురు కర్రలు తీసుకొని నాలుగు దిక్కులకు నమస్కరించి ముందు వరుసలో ప్రధాన్ (పర్థాన్)జాడీ లేదా మూరడి లేదా కలశం కటోడ (పూజారి) తీసుకొని నడుస్తుంటే వెనకాల ఇతర భక్తులు సాంప్రదాయ దుస్తులైన తెల్లని షర్టు తలకి తెల్లని పాగా ధరించి చెప్పులు లేకుండా పాదయాత్రలో వీరు వడగాం, సాలేవాడ, హస్నాపూర్, గౌరీ, కలమడుగు దగ్గర గోదావరి ఒడ్డుక చేరుకుంటారు.

గత ఏడాది వాడిన పాత వెదురు కర్రలు గోదావరిలో వదిలిపెట్టి గోదావరి నమస్కరించి ఈ కలశంలో కొత్త జలాన్ని సేకరించి తిరుగు ప్రయాణాన్ని ఉట్నూరు నుండి ఇంద్రవెల్లి చేరుకొని ఇంద్రవెల్లి లో 'ఇంద్రాణి దేవి'కి పూజ చేసి అనంతరం కేస్లాపూర్ లో గల ఆలయం ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర పాదయాత్రకు వెళ్లినటువంటి వారు చేరుకుని నీటి జాడిని మర్రి చెట్టుపై కడతారు. మర్రిచెట్టు నీడలో మూడు రోజులు సేద తీరుతారు.

ఈ సమయంలో తమ కుటుంబాలను తమ ఇతర కుటుంబ సభ్యులు బంధువులు ఎడ్ల బండ్ల ద్వారా నాగోబాకి చేరుకుంటాడు. ఈ మర్రిచెట్టు దగ్గర మూడు రోజులు 'గాదె ప్రధాన్' రాజ్ గోండుల యొక్క చరిత్ర, నాగోబా చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు సంగీత వాయిద్యాం కిక్రి వాయిస్తూ పారాయణం చేస్తారు.

మేస్రం వంశంలోని వివిధ కీత్త వారు పూజకి సంబంధించిన మట్టికుండలను పంపకాన్ని పీఠాధిపతి పటేల్, కటోడా, గాదే ప్రధాన్ ప్రధాన్స్ సమక్షంలో ముందుగా భూమాతకి పూజ చేసి, భూమికి తంబాకు లేదా బీడీ ఆకు సమర్పించి నమస్కరించి నాలుగు దిక్కులకు నమస్కరించి అనంతరం కిత్తాల వారీగా ఒక్కొక్కరికి మట్టి కుండలను పంపిణీ చేస్తారు. ఈ మట్టి కుండలతో మట్టి చెట్టు దగ్గర గల కోనేరు నుండి జలం సేకరించి పూజాకార్యక్రమానికి నైవేద్యం తయారీకి ఈ జలన్నే ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో తమ అల్లుళ్ళకు భాగస్వామ్యం కల్పిస్తారు.

పుట్ట తయారు చేయుట...

ఆలయం ఆవరణలో గల గత సంవత్సరం తయారు చేసిన మట్టి పుట్టను నూతన వెదురు కర్రలతో అల్లుళ్ళు పగలగొట్టి నీటిని చల్లి మట్టి బంతులను తయారుచేసి ఆ బంతులను 'సత్తికి దేవి' ఆలయం నాగోబా ఆలయంలో మట్టి బంతులకి పూజ చేసి అనంతరం పుట్ట తయారు చేస్తారు. పుట్ట ఒకరోజు పగలకుండా ఉన్నట్లయితే తమ అన్నదమ్ములు, ఆడపడుచులు బందు గణం సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు. ఈ క్రమం కార్యక్రమం జరుగుతున్నంత సేపు తమ సాంప్రదాయ సంగీత వాయిద్యాలయిన తుడుం, డోలు, పెప్రే, కాలికోమ్ చప్పుళ్ళతో కార్యక్రమం జరుపుతారు.

మహా పూజ..

ఈ కార్యక్రమంలో బెజ్జా కార్ కొత్త కానుకలుగా వారు అందించిన డబ్బుతో పూజ సామాగ్రి కొనుగోలు చేసి పుష్య అమావాస్య రోజున రాత్రి సమయంలో నాగోబాకి గోదావరి జలంతో అభిషేకంతో మహా పూజ కార్యక్రమాన్ని రహస్యంగా కటోడ, పటేల్స్, ప్రధాన్ మాత్రమే చేస్తారు. పూజ అనంతరం తమ బంధువులే గాక భక్తులందరూ హాజరవుతారు ఈ కార్యక్రమంలతో జాతర మొదలవుతుంది దేవుని సందర్శన కూడా మొదలవుతుంది.

బేటింగ్...

మహా పూజ అనంతరం అర్థరాత్రి సమయంలో ఆదివాసి మేస్రం వంశంలోని కొత్త కోడళ్ళు అప్పటివరకు నాగోబా ఆలయం ప్రవేశం చేయనటువంటి కోడళు ఈ కార్యక్రమం తో ఆలయ ప్రవేశం చేస్తారు.

ముందుగా వీరు - తెల్లని చీర ధరించి తలపై తెల్లని వస్త్రం ధరించి సత్తికి దేవి ఆలయం మరియు నాగోబా మహాలయాన్ని దేవుని మొట్టమొదటిసారిగా దర్శించుకొని తమ ఆడపడుచులకు కట్న కానుకలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం తమ జీవిత కాలంలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు.

కొత్త కోడళ్ళు ఇంటికి వచ్చిన ఇంటిలో ఎవరైనా చనిపోయినట్లయితే ఆ సంవత్సరం ఆలయ ప్రవేశం ఉండదు. ఇలా కొందరు 30 నుండి 40 సంవత్సరాలు పెళ్లయినా కూడా తము ఆలయం ప్రవేశం చేయని వారు చాలామంది ఉన్నారు ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నది.

నాగోబా దర్బార్…

ఆదివాసుల సమస్యల పరిష్కారానికి దర్బార్ ఒక వేదికగా మారినది. 1946 సంవత్సరంలో హైమన్ డార్ఫ్ ఈ దర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు నిరంతరంగా ప్రతి ఏడాది నాగోబా జాతర రోజున కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జిల్లా ప్రధానఅధికారులందరూ హాజరవుతారు. ఆదివాసులు తమ యొక్క సమస్యల విన్నవిస్తారు అలాగే సమస్యల పరిష్కారం కూడా జరుగుతుంది.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Whats_app_banner