Medaram police App: మేడారం జాతర సౌకర్యాలపై పోలీస్ శాఖ మొబైల్ యాప్.. అందుబాటులో పూర్తి సమాచారం…-police department mobile app on medaram fair facilities full information available ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Police App: మేడారం జాతర సౌకర్యాలపై పోలీస్ శాఖ మొబైల్ యాప్.. అందుబాటులో పూర్తి సమాచారం…

Medaram police App: మేడారం జాతర సౌకర్యాలపై పోలీస్ శాఖ మొబైల్ యాప్.. అందుబాటులో పూర్తి సమాచారం…

Sarath chandra.B HT Telugu
Feb 19, 2024 01:57 PM IST

Medaram police App: ఈ నెల 21 న ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా "మేడారం జాతర"కి Medaram Jatara ములుగు పోలీస్ డిపార్టుమెంటు భక్తుల భద్రత మరియు సౌలభ్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మొబైల్ యాప్ Mobile app అందుబాటులోకి తెచ్చారు.

మేడారం జాతర కోసం ములుగు పోలీసుల అండ్రాయిడ్ యాప్ సిద్ధం
మేడారం జాతర కోసం ములుగు పోలీసుల అండ్రాయిడ్ యాప్ సిద్ధం

Medaram police App: జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం తెలంగాణ పోలీసులు ప్రత్యేక మొబైల్ ఆప్ ను రూపొందించారు. అండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మేడారం వచ్చే భక్తులకు తెలియవలసిన వివరాలు, ప్రయాణం, సూచనలు వంటి అంశాలు ఉంచారు. అందరికి అర్థం అయ్యే విధంగా ఈ ఆప్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలలో సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఈ యాప్ లోని అంశాలు మేడారం జాతర యొక్క విశిష్టత, చరిత్ర, జాతర యొక్క కార్యక్రమ సరళి, తేదీలు, రోజువారీ కార్యక్రమాల వివరాలతో పాటు, జాతర జరిగే 4 రోజులలో ఉండే రద్దీ దృశ్యా ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి స్వంత లేదా ప్రైవేట్ వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు వేరు వేరు మార్గాలు అలాగే రావడానికి, తిరిగి వెళ్ళడానికి వేరు వేరు మార్గాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి స్వంత లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చేవారు ఏయే మార్గాల ద్వారా రావచ్చు, ఎక్కడి నుంచి ఎంత దూరం, ఎక్కడెక్కడ దారి మల్లింపులు ఉంటాయి, ఏ మార్గాల ద్వారా వచ్చే వారికి ఏ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి, ఏ మార్గం ద్వారా వచ్చిన వారు తిరిగి ఏ మార్గం ద్వారా తమ గమ్య స్థానం చేరుకోవచ్చు వంటి అంశాలను, దారిలో పాటించవలసిన సూచనలను, మ్యాప్ లు మరియు ప్రస్తుత స్థానం నుండి ప్రత్యక్ష గూగుల్ మ్యాప్ ద్వారా మేడారం చేరుకోవడానికి దారి సూచనలతో పాటుగా ఉంచారు.

మేడారం చుట్టుప్రక్కల ఉన్న 30కి పైగా పార్కింగ్ స్థలాలను భూ ఉపరితల అనుసంధానం చేసి (జియో ట్యాగ్గింగ్) ఆప్ వాడే వారు తామ ఉన్న స్థలం నుంచి అక్కడికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకునే విధంగా సూచనలను అందించడం, పార్కింగ్ సామర్థ్యం, పార్కింగ్ స్థలం విస్తీర్ణత, వంటి అంశాలు, ఆ పార్కింగ్ స్థలం నుంచి అమ్మవారి గద్దెలకు సుమారు దూరం, పార్కింగ్ స్థలాల నుంచి ఆర్టీసీ వారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సదుపాయం నుంచి సుమారు దూరం వంటి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

ఆర్టీసీ బస్సుల ద్వారా, రైలు మార్గాల ద్వారా వచ్చే మార్గాలు, తగిన సమాచారం ఉంది. భక్తులు ముఖ్యముగా తెలుసుకోవలసిన జాతర ప్రదేశాలైన జంపన్న వాగు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం, అమ్మవారి గద్దెల దర్శనం క్యూ లైన్లు వివరాలు ఉన్నాయి.

తప్పి పోయే వారి సహాయార్థం ఈ సారి ప్రత్యేకంగా సహాయ, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు, వివరాలు తెలపడానికి అతిపెద్ద తెరలను అందరు భక్తులకు కనబడే విధంగా పలు ప్రదేశాలలో ఏర్పరిచి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షించనున్నారు.

సహాయ కేంద్రాల వివరాలు, అదే విధంగా ఎవరైనా తమ వారు తప్పి పోయినా లేదా తప్పి పోయినవారు కనిపించినా, ఈ యాప్ ద్వారా ఫోటో మరియు వారి ప్రదేశం వివరాలతో సమాచారం అందించవచ్చు.

ఇవే కాకుండా భక్తులు ఏవైనా ఇబ్బందులు లేదా సంఘటనలు ఎదురైతే వాటిని పోలీసు వారికి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతర ప్రాముఖ్యత మరియు రద్దీ దృష్యా పౌరులు ఎటువంటి జాగ్రత్తలు ట్రాఫిక్ పరంగా, మరియు భద్రత పరంగా తీసుకోవాలి, సూచనలు, పాటించవలసిన నియమాలు సవివరంగా ఉన్నాయి.

ఒక్కసారి యాప్‌నుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చూడగలిగేలా, ముఖ్యంగా జాతర పరిసర ప్రాంతాలలో ఉన్న పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ పార్కింగ్, జంపన్న వాగు, దర్శనం ప్రదేశాల మధ్య దారి ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చూసుకునే విధంగా ఈ యాప్ ను రూపొందించారు.

ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ ఆఫ్లైన్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే, ఇంటర్నెట్ లేకున్నా కూడా పని చేయడం దీని ప్రత్యేకత. జాతర సమయంలో లో వచ్చే భక్తులకు అధిక రద్దీ కారణంగా ఇంటర్నెట్ కనెక్షన్ లేదా మొబైల్ సిగ్నల్ లేకున్నా, జాతర ముఖ్య ప్రదేశాల మధ్య ఇది దారి చూపించడం ఉపయోగకరంగా ఉంటుంది.

మేడారం ప్రవేశం, నిష్క్రమణ చుట్టుప్రక్కల ప్రదేశాల మార్గాలు, రహదారులు సూచించే మార్గ సూచిక మ్యాప్, అత్యవసర సమాచారం, చేయవలసినవి, చేయకూడనివి, సలహాలు, సూచనలు అందించడం, ఇతరులకు పంచుకోవడం వంటి సదుపాయాలతో పాటు, ఎప్పటికప్పుడు పోలీసులు పౌరులకు నేరుగా సమాచారం అందించడానికి వీలుగా ప్రకటనలు శీర్షిక కూడా ఉంది.

ఈ యాప్‌ను పొంద దలచుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి Guide to Medaram by MulugPolice అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://play.google.com/store/apps/details?id=com.medaram.police

(రిపోర్టింగ్- కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)

IPL_Entry_Point