Sammakka Saralamma: నేటి నుంచి మేడారం జాతర.. కాసేపట్లో గద్దెపైకి సారలమ్మ.. భారీగా తరలి వస్తున్న భక్తులు-sammakka saralamma maha fair starts from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sammakka Saralamma: నేటి నుంచి మేడారం జాతర.. కాసేపట్లో గద్దెపైకి సారలమ్మ.. భారీగా తరలి వస్తున్న భక్తులు

Sammakka Saralamma: నేటి నుంచి మేడారం జాతర.. కాసేపట్లో గద్దెపైకి సారలమ్మ.. భారీగా తరలి వస్తున్న భక్తులు

HT Telugu Desk HT Telugu
Feb 21, 2024 02:03 PM IST

Sammakka Saralamma Medaram Jatara: ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వేళైంది. బుధవారం సాయంత్రం సారలమ్మ మేడారం గద్దెలకు చేరుకోవడంతో మహాజాతర ప్రారంభం కానుంది.

గద్దెలపై చేరనున్న సమ్మక్క సారలమ్మ... బుధవారం సాయంత్రం నుంచి మేడారం జాతర
గద్దెలపై చేరనున్న సమ్మక్క సారలమ్మ... బుధవారం సాయంత్రం నుంచి మేడారం జాతర

Sammakka Saralamma Medaram Jatara: మేడారం జాతర కోసం మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు.

బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది.

సారలమ్మ రాకతో ఆరంభం

మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర telangana kumbha mela ప్రారంభమవుతుంది. గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా సారలమ్మతో పాటే బుధవారమే గద్దెలపై కొలువుదీరుతారు.

బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులైన వడ్డెలు ప్రత్యేక పూజలు చేస్తారు. సారలమ్మ ప్రధాన పూజారి అయిన కాక సారయ్య వెదురుబుట్ట(మొంటె)లో అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి చేరుకుంటారు.

అలా అమ్మవారిని తీసుకువస్తున్న క్రమంలో పూజారిని తాకడానికి భక్తులు చాలామంది ప్రయత్నిస్తుంటారు. సంతానం కోసం తపించే మహిళలు వరం పట్టి.. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా చీరలు పరిచి రోడ్డుపై పడుకుంటారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వారి పైనుంచే నడుచుకుంటూ మేడారం చేరుకుంటారు.

మార్గమధ్యలో ఉన్న జంపన్నవాగు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణ తంతును నిర్వహించిన అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు.

కొలువుదీరనున్న పగిడిద్దరాజు, గోవిందరాజు

సమ్మక్క భర్త పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మంగళవారమే బయలుదేరారు. పెనక వంశస్తులు కాలినడకన అటవీ మార్గంలో బయలుదేరి, ములుగు జిల్లాలోని లక్ష్మీపూర్ కు చేరుకున్నారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారానికి బయలుదేరారు.

కాగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కన్నాయి గూడెం మండలంలోని కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉండగా గిరిజన పూజారులు వీళ్లిద్దరిని బుధవారమే గద్దె మీదకు చేరుస్తారు.

రేపే సమ్మక్క రాక

మేడారం మహాజాతరలో భక్తులంతా సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తుంటారు. గురువారం సమ్మక్కను గద్దెల మీదకు తీసుకురావడంతో ఆ అపూర్వ ఘట్టానికి కూడా పూర్తవుతుంది.

సమ్మక్క గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుండగా.. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా అధికారిక సంకేతాలు ఇస్తారు.

కాగా సమ్మక్క తల్లిని చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి, ముస్తాబు చేస్తారు. ఆ సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోతుంటారు. రాత్రివేళ అమ్మవారిని గద్దెపైన ప్రతిష్టించి, భక్తులకు సమ్మక్క తల్లి దర్శన భాగ్యం కల్పిస్తారు.

నాలుగో రోజు వనంలోకి..

మహాజాతరలో మూడో రోజు శుక్రవారం అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. మేడారం వచ్చిన భక్తులంతా ఎత్తు బెల్లం, పసుపు కుంకుమ, సారె చీరెలు సమర్పించి మొక్కులు సమర్పిస్తారు. నాలుగో రోజు శనివారం సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతల వన ప్రవేశ ఘట్టం నిర్వహిస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది.

ఇక్కడ గిరిజనులే పూజారులు

సమ్మక్క–సారలమ్మ మేడారం జాతరలో ప్రధానంగా గిరిజనులే అమ్మవార్లకు పూజారులుగా వ్యవహరిస్తారు. వేద మంత్రోచ్ఛరణలు లేకుండా, విగ్రహ ఆరాధనలు ఏమీ లేకుండా, కేవలం కోయ పూజారులైన వడ్డెల ఆధ్వర్యంలో కోయ గిరిజన పద్ధతిలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. జాతరలో భక్తుల నుంచి వచ్చే ఆదాయంలో మూడో వంతు వాటా కోయ పూజారులకే ఇస్తుండటం విశేషం.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner