తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Saralamma: కొలువు దీరిన సారలమ్మ .. నేడే సమ్మక్క ఆగమనం.. జన సంద్రంగా మారిన మేడారం జాతర ప్రాంగణం

Medaram Saralamma: కొలువు దీరిన సారలమ్మ .. నేడే సమ్మక్క ఆగమనం.. జన సంద్రంగా మారిన మేడారం జాతర ప్రాంగణం

HT Telugu Desk HT Telugu

22 February 2024, 8:39 IST

    • Medaram Saralamma: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సారలమ్మ తల్లి మేడారం గద్దెలపై కొలువు దీరింది. ప్రభుత్వం లాంఛనాల నడుమ మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మను ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలు, శివసత్తుల నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు.
మేడారం జాతరలో గద్దెలపై చేరిన సారలమ్మ
మేడారం జాతరలో గద్దెలపై చేరిన సారలమ్మ

మేడారం జాతరలో గద్దెలపై చేరిన సారలమ్మ

Medaram Saralamma: మేడారం జాతరలో భాగంగా గద్దెపైకి చేరిన సారలమ్మను చూసేందుకు భక్త జనులంతా పోటీ పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాదాపు 12.15 గంటలకు సారలమ్మను గద్దెలపై ప్రతిష్టించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.

సారలమ్మకు ప్రత్యేక పూజలు

మేడారం గద్దెలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం ఉంది. బుధవారం ఉదయం పూజారులు సారలమ్మ గుడిలో, మేడారంలోని సమ్మక్క గుడిలో పూజలు చేశారు.

సారలమ్మ పూజారులైన చందా వంశీయులు కాక సారయ్య తదితరులు కన్నెపల్లిలోని గుడిలో పసుపు. కుంకుమ, సారె, చీరలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కన్నెపల్లిలో ప్రత్యేకంగా పట్నాలు వేశారు. గొట్టు గోత్రం సంబంధీకులు మేడారం గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేకంగా పూజలు చేశారు.

అనంతరం బుధవారం సాయంత్రం 7.30 గంటల సుమారులో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య కన్నెపల్లిలోని గుడి నుంచి మొంటె(వెదురుబుట్ట)లో అమ్మవారి ప్రతిరూపంగా భావించి పసుపు, కుంకుమ భరిణెలను తీసుకుని మేడారానికి బయలు దేరారు.

మార్గమధ్యలో ఉన్న జంపన్నవాగులో పూజలు చేసి, గద్దెల వద్దకు బయలుదేరారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న మహిళలు కన్నెపల్లిలోని ఆలయం వద్ద వరంపట్టారు. వరం పట్టిన వారిపైనుంచి నడుచుకుంటూ పూజారులంతా గద్దెలకు వచ్చారు.

ఈ సందర్భంగా అమ్మవారిని తాకేందుకు భక్తులు పోటీపడే ప్రయత్నం చేశారు. దీంతోనే పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య రాత్రి 12.30 గంటల సుమారులో సారలమ్మను గద్దెలపై కొలువుదీర్చారు.

నేడు గద్దెల మీదకు సమ్మక్క రాక

మహాజాతరలో అసలైన అపూర్వఘట్టం గురువారం సాయంత్రం జరగనుంది. మేడారంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గురువారం సాయంత్రం గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టాన్ని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సమ్మక్క తల్లిని పూజారులు గురువారం గద్దెల వద్దకు తీసుకురానుండగా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం గిరిజన పూజారులు చిలకలగుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెల పైకి తీసుకు వచ్చే క్రతువును మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పూజారులు, వడ్డెలు చిలకలగుట్టలోకి వెళ్తారు.

ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్టపైకి వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద దాదాపు మూడు గంటల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత పూజారిపై అమ్మవారు పూనిన తరువాత కుంకుమ భరిణె రూపంలో అమ్మవారిని తీసుకుని కిందికి వస్తారు.

ప్రభుత్వ లాంఛనాలతో జాతర ప్రారంభం…

సమ్మక్క ఆగమనానికి సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఏకే 47 గన్ తో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఇది సమ్మక్క మహాజాతరలో ప్రధాన ఘట్టం. అనంతరం సమ్మక్కను గద్దె తీసుకువస్తుంటారు. ఈ సమయంలో సమ్మక్కను తాకేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

దీంతోనే సమ్మక్క రాక సందర్భంగా దారి పొడవునా జనాలు పెద్ద ఎత్తున మోహరించి ఉంటారు. ఇలా పోటీపడే క్రమంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో ప్రత్యేక పోలీసుల బలగాలు, రోప్ పార్టీ భద్రత సహా మూడంచెల భద్రత నడుమ సమ్మక్కను ఆలయానికి తోడ్కొని వస్తారు. అనంతరం గద్దెల పై సమ్మక్క తల్లిని ప్రతిష్టిస్తారు.

మేడారం.. భక్త జన సందోహం

ఇప్పటికే మేడారం జన సంద్రంగా మారగా... సమ్మక్క ఆగమనం తరువాత మొక్కులు సమర్పించుకునేందుకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. దీంతో క్యూ లైన్లు గురువారం నుంచి కిటకిటలాడే ఛాన్స్ ఉంది. కాగా బుధవారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తుండగా.. సమ్మక్క ఆగమనం తరువాత భక్తుల తాకిడి మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మేడారం పరిసరాల్లో గుడారాలు వేసుకుని ఉండగా.. వారంతా గురువారం మొక్కులకు బయలుదేరే అవకాశం ఉంది.

నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక

సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తరలిరానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కాచిగూడలోని తన నివాసం నుంచి బయలు దేరి 11.45 గంటలకు బేగంపేటలోని హెలిప్యాడ్ నుంచి మేడారం బయలు దేరనున్నారు.

గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలకు మేడారం చేరుకుని, 1.15 గంటలకు దర్శనానికి వెళతారు. ఆ తరువాత సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి 2.15 గంటలకు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి 3.30 గంటలకు కుమ్రంభీం జిల్లాలోని సిర్పూరు కాగజ్ నగర్ కు చేరుకుంటారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం