Medaram Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు
Medaram Jatara: భక్తుల కొంగు బంగారమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి.2024 ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో మహాజాతర నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు.
Medaram Jatara: తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. 2024 ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో మేడారం మహాజాతర నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు. ములుగు జిల్లా మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో జాతర తేదీలను ఖరారు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమి ముందు వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. ఈ సారి జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించాలని పూజారుల సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.
2024 ఫిబ్రవరి 21న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. 22వ తేదీన చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది. 23న భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. 24 న సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతల వన ప్రవేశం చేస్తారు. 28వ తేదీన తిరుగువారం జాతరతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహా జాతర పూజలు ముగియనున్నట్లు పూజారుల సంఘం తెలిపింది.
మండ మెలిగే పండుగగా పిలిచే మేడారం మినీ జాతర 2023 ఫిబ్రవరిలో ఘనంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
మేడారం జాతర నేపథ్యం ఏంటంటే
కాకతీయ సేనలు.. గిరిపుత్రులను వేధిస్తున్న సమయంలో కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలని చెబుతారు. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ.. జాతర నిర్వహిస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా.. ఆ తర్వాత జన జాతరగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లోకోసారి ఈ జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో మొదలై వన దేవతల ఆగమనంతో.. అసలైన మహా జాతర ప్రారంభమవుతుంది.
తెలంగాణ కుంభమేళగా గుర్తింపు…
జాతర తొలిరోజు.. కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.