తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy : దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు.. అక్కడి పరిచయంతో గంజాయి వైపు మళ్లాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు!

Sangareddy : దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు.. అక్కడి పరిచయంతో గంజాయి వైపు మళ్లాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు!

HT Telugu Desk HT Telugu

18 October 2024, 16:42 IST

google News
    • Sangareddy : కారులో తరలిస్తున్న 40 కేజీల నిషేధిత ఎండు గంజాయిని, 50 గ్రాముల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ వెల్లడించారు. గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందన్నారు.
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

ఎస్పీ రూపేష్ కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కి పట్టణం బిరదేవ్ కాలనీకి చెందిన మల్లుగొండ (31).. గతంలో ఓ దొంగతనం కేసులో బీదర్ జైలుకు వెళ్లాడు. అక్కడ జైలులో ఉండగా మల్లుగొండకు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాహుల్ చక్రవర్తితో పరిచయం ఏర్పడింది. గంజాయి సరఫరా చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అతను నమ్మించాడు. జైలు నుండి బయటకు వెళ్లాక భాల్కికి చెందిన మల్లేష్ అనే వ్యక్తిని కలవమని చెప్పాడు. రాహుల్ చెప్పిన విధంగా జైలు నుండి విడుదలైన వెంటనే మల్లేష్‌ను కలిసాడు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్మి.. డబ్బులు సంపాదిస్తున్నాడు.

కారులో తరలిస్తుండగా..

ఈ క్రమంలో గురువారం కారులో ఎండు గంజాయి బస్తాలతో కర్ణాటక నుండి నారాయణఖేడ్ వైపు నాగలగిద్ద మీదుగా మల్లుగొండ వస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మనూర్ ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి.. మనూరు మండలం దావూరు చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కారులో ఉన్న 40 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందన్నారు. నిందితునికి సహకరించిన మల్లేష్ జాదవ్, దాదా పాటిల్, రాహుల్ చక్రవర్తిలు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. గతనెలలో చిరాగ్‌పల్లి పోలీసులు స్వాదీనం చేసుకున్న 140 కిలోల ఎండు గంజాయి కేసులో నిందితుడు మల్లుగొండ.. దొరకకుండా తప్పించుకున్నాడని, ఇప్పుడు పట్టుకున్నామని పోలీసులు వివరించారు.

అమీన్‌పూర్‌లో హష్ ఆయిల్..

పటాన్‌చెరు పరిధిలోని భీరంగూడ వేంకటేశ్వర స్వామి గుడి వద్ద.. ముగ్గురు వ్యక్తులు అరకు నుండి నిషేదిత హష్ ఆయిల్ తీసుకొని వచ్చి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో అమీనపూర్ ఎస్ఐ విజయ్ రావ్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. 11 చిన్న చిన్న డబ్బాలలో నింపి ఉన్న 50 గ్రాముల హష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 25 వేలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఈ కేసులో నిందితులు పటాన్‌చెరు మండలం కిర్బీ కాలనీకి చెందిన దాసు సాయి శివ (26), ఆమీన్‌పూర్ పట్టణంలో లక్ష్మి సాయి మెడోస్‌లో నివసిస్తున్న అఖిలేష్ (26), ఆమీన్‌పూర్‌కు చెందిన ప్రేమ్ (27)ను అదుపులోకి తీసుకున్నారు.

కాలేజీ రోజుల నుంచే అలవాటు..

ఈ ముగ్గురు నిందితులు చదువుకునే రోజుల నుండి కళాశాలలో హష్ ఆయిల్ తాగడానికి అలవాటుపడ్డారని పోలీసులు వివరించారు. బిలాల్, శంకర్‌ల వద్ద కొనుగోలు చేసి తాగే వారని చెప్పారు. ఈ క్రమంలో అరకులో సుబ్బారావు అనే వ్యక్తి వద్ద హష్ ఆయిల్ లభిస్తుందని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి తీసుకొచ్చి వినియోగించుకోగా మిగిలిన హష్ ఆయిల్ అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు.

నిందితుడు సాయి అరకు వెళ్లి 50 గ్రాముల హష్ ఆయిల్ ను తీసుకొని వచ్చి.. బీరంగూడ వెంకటేశ్వర టెంపుల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో అరకుకు చెందిన సుబ్బారావు, లింగంపల్లికి చెందిన శంకర్, జాయ్, బిలాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు ప్రకటించారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం