Constable Selfie Video : గంజాయి కేసులో సస్పెండ్..! కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు
Bhadradri Kothagudem District News : గంజాయి కేసులో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలపై సంచలన ఆరోపణలు చేశాడు. గంజాయి కేసులో తనను బలి పశువును చేశారని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
గంజాయి కేసులో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాగర్ ఇటీవల గంజాయి కేసులో సస్పెండ్ అయ్యాడు. పోలీస్ స్టేషన్ లో ఉంచిన పట్టుబడిన గంజాయి మాయమైన వ్యవహారంలో ఇతనిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా తాజాగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ అతను ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లాలో సంచలనం రేపుతోంది.
ఎస్ఐలు సంతోష్, రాజ్ కుమార్ చేసిన పనికి నేను బలయ్యానంటూ ఆ వీడియోలో సాగర్ ఆరోపించడం పోలీస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. తాజాగా కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో తాను కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా ఎస్సై సంతోష్.. బిఆర్ఎస్ నేత గోనెల నానితో కలిసి గంజాయి వ్యాపారం చేశారని సాగర్ ఆరోపించారు.
ఎస్ఐ సంతోష్ తర్వాత వచ్చిన రాజ్ కుమార్ ఎస్సై సైతం నానితో కలిసి వ్యాపారం చేశాడని వాగ్మూలంలో పేర్కొన్నారు. స్టేషన్లో పట్టుబడ్డ గంజాయిని బయటికి తీసుకెళ్లి వీరందరూ లోకల్ యువకులతో గంజాయి వ్యాపారం చేయించేవారని సాగర్ ఆరోపించారు. స్టేషన్లో సీజ్ అయిన గంజాయి మాయమైందని ఆరోపణలు రావడంతో నా ఫోన్ ద్వారా ఫోన్లు చేసిన ఎస్ఐ ఆ తర్వాత స్టేషన్లో గంజాయి మిస్ అయిన విషయాన్ని తనపైకి నెట్టి తెలివిగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఐలు సంతోష్, రాజ్ కుమార్ లు చేసిన పనికి తాను బలి పశువుగా మారానని ఆవేదన చెందాడు. ఈ వీడియోలో "అమ్మ నన్ను క్షమించు.." అంటూ కానిస్టేబుల్ సాగర్ వేదన చెందడం కంటతడి పెట్టిస్తోంది. కాగా కానిస్టేబుల్ సాగర్ పరిస్థితి విషమించడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనతో ఏకంగా పోలీస్ స్టేషన్ లో గంజాయి మాయమైన వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం బట్టబయలు కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.