Hyderabad : నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు-hyderabad police arrested the accused in nampally idol destruction case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

Hyderabad : నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

Basani Shiva Kumar HT Telugu
Oct 12, 2024 02:38 PM IST

Hyderabad : నాంపల్లిలో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే.. అతనికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.

ధ్వంసమైన అమ్మవారి విగ్రహం
ధ్వంసమైన అమ్మవారి విగ్రహం

దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూల్‌కు చెందిన కృష్ణయ్య గౌడ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి.. ఆహారం కోసం దుర్గామాత దగ్గరికి వెళ్లారని పోలీసులు వివరించారు. అక్కడ ఆహారం కోసం వెతికినా ఏమీ దొరకకపోవడంతో.. కోపంతో మండపాన్ని చిందరవందర చేసి, దుర్గామాత చేయిని విరగ్గొట్టాడని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడు కృష్ణయ్య గౌడ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు.

ఏం జరిగిందంటే..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని 11వ తేదీన ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు.. విచారణ చేపట్టారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిష్టిస్తారు.

గురువారం రాత్రి దాండియా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత దుండగుడు విగ్రహం నెలకొల్పిన దగ్గరకు వచ్చారు. మొదటగా కరెంట్‌ను కట్ చేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు విరగగొట్టారని నిర్వాహకులు చెబుతున్నారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగ్గొట్టారు. పూజా సామాన్లను పడేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేడ్లను విరగ్గొట్టారని స్థానికులు చెబుతున్నారు.

ప్రతీ సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి. అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆగస్టు 27న కూడా పాతబస్తీలో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అక్కడి పూజా సామాగ్రి, పీట, ఇతర వస్తువులను చిందర వందర చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అమ్మవారి విగ్రహంపైన ఉండే కిరీటం కిందపడి ఉండటం, అక్కడే రాళ్లు పడి ఉండటం ఈ వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.

Whats_app_banner