Telangana Elections 2023 : పాతబస్తీలో రిగ్గింగ్....? రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Telangana Assembly Elections 2023: పాతబస్తీలో రీపోలింగ్ నిర్వహించాలన కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది.
Telangana Assembly Elections 2023: నవంబర్ 30న పాతబస్తీలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ఎంఐఎం పార్టీ బోగస్ ఓట్లు వేయించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.అన్నీ సీసీటీవీ కెమెరాల పరిశీలన తరువాతనే కౌంటింగ్ ప్రక్రియ జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
రీపోలింగ్ కు కాంగ్రెస్ డిమాండ్
ముఖ్యంగా చంద్రాయణగుట్ట,చార్మినార్,బహదూర్ పుర నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని…తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని,అవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఆధారాలన్నీ పూర్తి స్థాయిలో పరిశీలన తరువాతే పాతబస్తీలో కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజును కోరారు.
ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు
పాతబస్తీలో ఎంఐఎం నాయకులు,కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తల పై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలింగ్ రోజున ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించి ఎంఐఎం తన అహంకారాన్ని ప్రదర్శించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.పోలింగ్ కేంద్రంలో కేవలం ఎంఐఎం పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఎలా ఉంటారు? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రశ్నించారు.
ఇతర పార్టీ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రం లోపలకి రానివ్వకుండా అడ్డుకొని రిగ్గింగ్ కు పాల్పడ్డారని నిరంజన్ వెల్లడించారు.చంద్రయనగుట్ట,చార్మినార్,బహదూర్ పురా నియోజిక వర్గాల్లో పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసిన అన్నీ సీసీటీవీ కెమెరాలను,వెబ్ కెమెరాలను తనిఖీ చేసి నిందితుల పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా