Firing At Nampally: హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం.. ఒకరికి గాయాలు
Firing At Nampally: హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. తెల్లవారు జామున తనిఖీల్లో ఉన్న పోలీసులపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది.
Firing At Nampally: హైదరాబాద్‌లో పోలీస్ తుపాకీలు మరోసారి గర్జించాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతున్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానిత వ్యక్తి దాడికి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా ఉలిక్కి పడ్డారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు చోటు చేసుకోవడం నాలుగోసారి జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎల్‌బి నగర్ సమీపంలో కూడా పార్దీముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.
నాంపల్లి ఘటనలో గాయపడిన వ్యక్తిని అనీష్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అనుమానిత వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో తొలుత వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు. పోలీస్ కాల్పులతో అనీష్, రాజ్ అనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన వారు దోపిడీ దొంగలుగా భావిస్తున్నారు.
తెల్లవారుజామున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు ప్రశ్నిస్తుండగా నిందితులు వారిపై దాడికి దిగారు. రాళ్లు, గొడ్డలితో పోలీసులపై దాడి చేసేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. నగర శివార్లలో దోపిడీలకు పాల్పడే నిందితులు రైల్వే స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోగా తీసుకున్నారు, మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.
గత వారంలో ఇదే తరహా ఘటన…
హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న పార్దీ ముఠాను పట్టుకునే క్రమంలో గత వారం కాల్పులు జరపాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న దంపతులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. దాడి సమయంలో నిందితుల్లో ఒకరి ఫోటోను బాధితురాలు ఫోన్‌లో తీయడంతో సాంకేతిక పరిజ్ఞానంతో వారిని గుర్తించారు.
నిందితులు హయత్‌నగర్ సమీపంలో ఉన్న కల్లు కాంపౌండ్‌లకు వస్తున్నట్టు గుర్తించారు. వారు ఫోన్లు కూడా వాడకపోవడంతో వారిని ట్రేస్ చేయడం కష్టమైంది. కల్లు కాంపౌండ్లకు వచ్చే వారి నుంచి ఫోన్లు తీసుకుని తమ సొంతూళ్లకు కాల్స్ చేసేవారు. ఈ క్రమంలో హయత్ నగర్ నుంచి నిందితుల స్వస్థలాలకు వెళుతున్న కాల్స్ గుర్తించి నిఘా పెట్టారు. స్థానికులను అరా తీయడంతో చిట్యాల వద్ద దోపిడీకి పాల్పడిన వారిలో ఒకరిని గుర్తించారు.
ఈ క్రమంలో నిందితులు హయత్ నగర్ మీదుగా ఎల్‌బి నగర్ వైపు ఆటో వెళుతున్నట్టు ట్రాక్ చేశారు. ఎల్‌బి నగర్ వద్ద వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో వారు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో నిందితులపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.