Medak Politics : దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు మెదక్ ఎంపీ గా ఎట్లా చెల్లుతారు- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
24 March 2024, 19:02 IST
- Medak Politics : దుబ్బాకలో చెల్లని రఘునందర్ రావు, మెదక్ ఎంపీగా ఎట్లా చెల్లుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని పక్కా లోకల్ అన్నారు.
బీఆర్ఎస్ నేతలు
Medak Politics : దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు(Raghunandan Rao), మెదక్ ఎంపీగా ఎట్లా చెల్లుతారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(Mla Chinta Prabhakar) విమర్శించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో(BRS Venkatramreddy) కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్థానికేతరుడు అని చేసిన వ్యాఖ్యలను చింతా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. వెంకట్రాంరెడ్డి మెదక్ (Medak Politics)ప్రజలకు ఎంతో సేవచేశారన్నారు. దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు, మెదక్ ఎంపీగా ఎట్లా చెల్లుతారని ఆయన ప్రశ్నించారు. గురిగింజ కింద ఉన్న నలుపు దానికి కనిపించదన్న చందంగా బీజేపీ వాళ్ల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వెంకట్రాంరెడ్డి కరీంనగర్ వాసి అనడాన్ని తప్పుబట్టారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి పక్కా లోకల్ అని గతంలో ఉమ్మడి జిల్లాలో డ్వామా పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. రఘునందన్ రావుకు ఏమున్నదని ప్రశ్నించారు. రఘునందన్ రెండు మూడు ముచ్చట్లు మాట్లాడగానే, పోటీలోకి వస్తాననుకోవడం భ్రమ అవుతుందన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్ప అందరూ బయట నుంచి వచ్చినవారే
బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ సతీమణి రాజస్థాన్ నుండి పోటీ చేయలేదా? మోదీ (Modi) గుజరాత్ ను వీడి వారణాసిలో పోటీ చేసిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ చింతా ప్రభాకర్ నిలదీశారు. ఈటల రాజేందర్ కరీంనగర్ వీడి మల్కాజిగిరి నుంచి పోటీ చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీలోని 15 ఎంపీ సీట్లలో కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) తప్ప మిగతా వారు అందరూ బయట నుంచి వచ్చినవారేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
మెదక్ జిల్లాతో 2002 నుంచి సంబంధం
వెంకట్రాంరెడ్డికి 2002 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District)తో సంబంధం ఉందని, కలెక్షన్ కోసం ఎలక్షన్ లోకి రాలేదన్నారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలో పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషిచేస్తారన్నారు. బీజేపీ (BJP)నేతలు రాష్ట్రానికి కేంద్రం చేసిన అభివృద్ధి చూపి, కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. వందకి వంద శాతం మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ (BRS)గెలుపు ఖాయమని చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు మెదక్ కరస్పాండెంట్