Etela Rajender : తెలంగాణ పల్లెల్లో మందులు దొరకడంలేదు కానీ మందు దొరుకుతుంది- ఈటల రాజేందర్
Etela Rajender : తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ పల్లెల్లో మందులు దొరకడంలేదని కానీ మద్యం ఏరులై పారుతోందన్నారు.
Etela Rajender : తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించాలిసిందేనని, కానీ ఆటో డ్రైవర్ లకు ఇస్తామన్న రూ.12 వేల సాయం వెంటనే ఇవ్వాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్(Etela Rajender) డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా మెదక్ పట్టణంలో పర్యటించిన ఈటల మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. పేదలకు వైద్యం అందించాలని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షలు ఇస్తున్నారని, ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )సీఎం కాకముందు బెల్ట్ షాపులు మూసేస్తానని తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రని ఈట లరాజేందర్ ఘాటైన విమర్శలు గుప్పించారు. ఆరోగ్యం బాగలేకపోతే మందులు దొరకడంలేదు కానీ తెలంగాణ పల్లెల్లో మద్యం ఎల్లప్పుడూ దొరుకుతుందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు తాగుడుతో వచ్చే ఆదాయం రూ. 10,700 కోట్లు ఉంటే, నేడు రూ 45 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బెల్ట్ షాపులు మూసేయాలి డిమాండ్ చేశారు.
రుణమాఫీ పైన బహిరంగ చర్చకు సిద్ధమా
దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న కేసీఆర్, రూ లక్ష రుణమాఫీ(Loan Waiver) చేయలేక బోల్తాపడ్డాడని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందో చేసి చూపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే సుమారుగా రూ 34,000 కోట్లు అవసరం అవుతాయని, ప్రభుత్వం నిధులు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని కోరారు. రుణమాఫీపై బహిరంగచర్చకు నేను సిద్ధం...రేవంత్ నువ్వు సిద్ధమా అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. అలవికాని హామీలు చేసి, ప్రజలను కాంగ్రెస్ పార్టీ గోల్ మాల్ చేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఖతం
మోదీ ప్రభుత్వం వచ్చాక బోర్డర్ లో ఆర్మీలు ప్రశాంతంగా ఉంటున్నాయని ఈటల(Etela) అభిప్రాయపడ్డారు. మోదీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు జరుగుతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అది నిజంకాదని ఈ పదేళ్లలో తెలిసిపోయిందని రాజేందర్ తెలిపారు. కరోనా వస్తే మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఆకలి తీర్చారని, ప్రపంచంలో మొట్టమొదటిగా కరోనా వ్యాక్సిన్ వచ్చింది మోదీ వల్లేనని అందరు గుర్తుంచుకోవాలని అన్నారు. రైల్వేస్టేషన్లు ఒకప్పుడు కంపు కొడుతుండే.. నేడు అద్దంలా మెరిసిపోతున్నాయన్నాకు. 12 కోట్ల ఇండ్లల్లో టాయిలెట్స్ కట్టించింది మోదీ అన్నారు. 4 కోట్ల ప్రజలకు సొంత ఇండ్లు కట్టించిండ్రు అన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఖతం అయిందన్నారు.
సంబంధిత కథనం