Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు నెరవేర్చి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి- మాజీ మంత్రి హరీశ్ రావు-dubbaka news in telugu ex minister harish rao demands congress govt fulfill six guarantees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు నెరవేర్చి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి- మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు నెరవేర్చి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి- మాజీ మంత్రి హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu

Harish Rao : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్ లాంటిదని, బండి నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందుకుంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా తెలుస్తుందన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : తన పైన కత్తిపోటు దాడి తర్వాత దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ విషయంపైన మొట్టమొదటి సారి మాట్లాడారు. అప్పటికి మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దుబ్బాక నియోజకవర్గంలో దౌల్తాబాద్ మండలంలో సూరంపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ప్రభాకర్ రెడ్డి పైన ఒక దుండగుడు కత్తి దాడికి పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన హరీశ్ రావుకి, తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారని అన్నారు.

ఎన్నికలో ప్రచార బాధ్యతను మొత్తం తానే తీసుకుంటానని చెప్పినా తాను వినలేదని మాజీ మంత్రి తెలిపారు. చివరికి ఆలోచన చేసుకోవడానికి ఒకరోజు సమయం కావాలని కోరిన ప్రభాకర్ రెడ్డి, కొద్దిరోజుల తర్వాత తన సమ్మతిని తెలియచేశారని హరీశ్ రావు అన్నారు. ఎన్నడూ చీమకు కూడా హాని తలపెట్టని ప్రభాకర్ రెడ్డి, రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన ప్రభాకర్ రెడ్డి, తన పైన దాడి తర్వాత తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో ఎక్కువగా పాల్గొనలేకపోయినప్పటికీ, దుబ్బాక పార్టీ కార్యకర్తలు ఆ బాధ్యతను మొత్తం వారి నాయకుని గెలుపు కోసం తమ భుజాలకెత్తుకున్నారని, ఆయన కొనియాడారు. 53 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించారంటే, కార్యకర్తలు తమ చేతితో కమ్మటి బిర్యానీ నాకు వొడ్డించినంత సంతోషంగా ఉన్నదన్నారు.

మళ్లీ పుంజుకుంటాం

"ఈ అసెంబ్లీ ఎన్నికలు మనకు స్పీడ్ బ్రేకర్ వంటివని, బండి నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందుకుంటుంది. అలాగే గత ఎన్నికలలో తెలిసో, తెలియకనో తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకుని ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రజలు మన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే తేడాను గుర్తిస్తున్నారన్నారు. రైతుల మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమ కాంగ్రెస్ నాయకులకు ఉండదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలను నెరవేర్చిన తర్వాతనే లోక్ సభ ఎన్నికలలో ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి. దిల్లీలో మన గొంతు వినిపించడానికి, తెలంగాణ ప్రయోజనాలకు కాపాడడానికి ఈ ఎన్నికలు కీలకమన్నారు. మనకు పోరాటాలు కొత్తకాదు. ఇదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు"- మాజీ మంత్రి హరీశ్ రావు