Telangana Budget 2024 : త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు - రైతు భరోసాపై బడ్జెట్ లో కీలక ప్రకటన, శాఖలవారీగా కేటాయింపులు ఇవే
Telangana Budget 2024 -2025 : తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతుల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు భట్టి విక్రమార్క.
Telangana Vote On Account Budget 2024 -2025 : రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్దెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన… రుణమాఫీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నామని చెప్పారు. రూ. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రైతుబంధు మంచి పథకమే అయినప్పటికీ… సాగు చేయనివారికి కూడా డబ్బులు ఇవ్వటం సరికాదని అభిప్రాయపడ్డారు. రైతుబంధు నిబంధనలను సవరిస్తామని ప్రకటిస్తున్నానని చెప్పారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేల పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేదని… అలాంటి వాటికి అవకాశం లేకుండా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ లో పూర్తిస్థాయిలో మార్పులు చేసి… అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నామని భట్టి ప్రకటించారు.
ధరణి కొంతమందికి భరణంగా మారిందన్నారు భట్టి విక్రమార్క. మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నామని…. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీని ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా పెంచి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు…
మొత్తం బడ్జెట్ 2,75,891కోట్లు.
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
ఐటి శాఖకు 774కోట్లు.
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
పురపాలక శాఖకు 11692 కోట్లు.
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
విద్యా రంగానికి 21389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
వైద్య రంగానికి 11500 కోట్లు.
విద్యుత్ - గృహ జ్యోతికి 2418 కోట్లు.
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.
రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి భట్టి. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామని…. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సంబంధిత కథనం