తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Dowry Death : ప్రేమించి పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

Sangareddy Dowry Death : ప్రేమించి పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

HT Telugu Desk HT Telugu

10 March 2024, 22:06 IST

google News
    • Sangareddy Dowry Death : వరకట్న రక్కసి చేతిలో మరో వివాహిత ప్రాణాలు వదిలింది. సంగారెడ్డి జిల్లాలో అత్తింటి వారి వరకట్న వేధింపులతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Sangareddy Dowry Death : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని, బాబు పుట్టాక రూ. 10 లక్షలు కట్నం(Dowry Harassment) తేవాలంటూ భర్త వేధిస్తుండడంతో మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య(Dowry Death) చేసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా(Nizamabad) మర్పల్లి మండలం దుబ్బాకకు చెందిన ఆమని, డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన హరీష్ ఇద్దరు బీటెక్ కలిసి చదువుకునే క్రమంలో ఒకరొనొకరు ప్రేమించుకున్నారు. కాగా పెద్దల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు. వీరు అమీన్ పూర్ మండలం పటేల్ గూడ పరిధిలోని సృజనలక్మి నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమని ఐటీ ఉద్యోగం చేస్తుండగా, హరీష్ ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. కాగా ఈ దంపతులకు 18 నెలల బాబు ఉన్నాడు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.

రూ. 10 లక్షలు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు

అత్తింటివారు, భర్త, మరిది వెంకటేష్ కలిసి రూ. 10 లక్షలు కట్నం తీసుకరావాలంటూ ఆమనిపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయంలో ఆమని తల్లిదండ్రులు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు. అయినా భర్త హరీష్ లో మార్పు రాలేదు. కాగా సంవత్సరన్నర బాబు ఉండడంతో ఆమని ఇంతకాలం వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇక ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమని శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణ వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాబును వదిలి వెళ్లిపోయావా? అంటూ బోరున విలపించారు. వరకట్నం విషయంలో భర్త హరీష్, అతని సోదరుడు వెంకటేష్, కుటుంబసభ్యులు వేధించడంతో తన అక్క ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు నవదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్ పూర్ పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి(Farmer Death) చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy) నర్సాపూర్ మండలం మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన నవాపేట భిక్షపతి (42), నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భిక్షపతి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా శనివారం భిక్షపతి తన పెద్ద కొడుకు చరణ్ తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో బోరు బావికీ విద్యుత్ సరఫరా అయ్యే సర్వీస్ తీగ కిందపడడం గమనించని రైతు ఆ తీగను పక్కకు పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. భయంతో చరణ్ పరుగెత్తుకుంటూ వచ్చి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే వారు అక్కడికి చేరుకొని భిక్షపతిని చికిత్స కోసం నర్సాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో చనిపోయినట్లు గుర్తించారు.

తదుపరి వ్యాసం