Dowry Death : సిద్దిపేటలో విషాదం, వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
Dowry Death : వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు భర్త, అత్త, ఆడపడుచుపై కేసు నమోదు చేశారు.
Dowry Death : సిద్దిపేట జిల్లాల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దౌల్తాబాద్ మండల పరిధిలోని మూబారస్ పూర్ గ్రామానికి చెందిన చింతకింది ఎల్లం కూతురు రేఖ(24)కి, ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన బాబుతో 2021 లో వివాహమైంది. వారికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో ఒప్పుకున్న 3 తులాల బంగారం కొన్ని రోజుల తర్వాత పెడతామని రేఖ తండ్రి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కొంతకాలం రేఖని అత్తగారింట్లో బాగానే చూసుకున్నారు. కానీ తండ్రి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఒప్పుకున్నా బంగారం పెట్టలేక పోయాడు. ఈ విషయంలో భర్త, అత్త, ఆడపడచు రేఖని బంగారం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె తండ్రి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి ఈ సంవత్సరంలో బంగారం పెడతామని మరల ఒప్పందం చేసుకున్నాడు. కాగా గురువారం సోదరుడు వచ్చి ఇంట్లో పండగ ఉందని చెప్పి రేఖని పుట్టింటికి తీసుకొని వెళ్లాడు. మరల శుక్రవారం తిరిగి అత్తవారింటికి తీసుకొచ్చాడు.
కూతురు చావుకు భర్త, అత్తమామలు, ఆడపడచు కారణం
తల్లిగారింటి నుంచి వచ్చిన తర్వాత భర్త, అత్తమామలు ఆమెను బంగారం తీసుకొచ్చావా? అని మరల వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన రేఖ శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య(Dowry Death) చేసుకుంది. వెంటనే గ్రామస్తులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉంది. తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కూతురు చావుకు భర్త, అత్తమామలు, ఆడపడచు కారణమని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రేమ వ్యవహారంతో యువకుడు ఆత్మహత్యాయత్నం
ప్రేమ(Love Issue) వ్యవహారంతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్ధిపేట(Siddipet) కూరగాయల మార్కెట్ ఆవరణలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణం రాంనగర్ కు చెందిన మండల రాజు స్థానిక వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి పని ముగించుకున్న తర్వాత తమ బంధువులను కలవడానికి పాత కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చాడు. వారితో మాట్లాడుతున్న క్రమంలోనే రాజు గొంతు కోసుకున్నాడు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజు ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని వారు తెలిపారు.
సంబంధిత కథనం