Hyderabad Crime : దంపతుల మధ్య చిచ్చుపెట్టిన జ్యోతిష్యం, వివాహిత ఆత్మహత్య
Hyderabad Crime : హైదారాబాద్ లోని అంబర్ పేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జ్యోతిష్యం వల్ల భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తి, భార్య ఆత్మహత్యకు చేసుకుందని తెలుస్తోంది.
Hyderabad Crime : హైదరాబాద్ లోని అంబర్ పేటలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జ్యోతిష్యం వల్ల తలెత్తిన వివాదం భార్య ఆత్మహత్యకు దారి తీసింది. అంబర్ పేటలోని ఇందిరానగర్ కు చెందిన బబిత అనే యువతికి ఐదేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆదివారం కుమారుడి పుట్టినరోజు వేడుకలు తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. అయితే బబిత తల్లిదండ్రులు తప్ప బంధుమిత్రులంతా పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్లాడు, రెండు గంటలకు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తన తల్లి ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతుండడం చూసి కింద పోర్షన్ లో అద్దెకు ఉంటున్న తన బాబాయ్ వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే వారు బబితను ఆసుపత్రికి తరలించగా....అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే కూతురి మృతి గురుంచి సమాచారం అందుకున్న బబిత తల్లిదండ్రులు, బంధువులు భర్త రామకృష్ణపై దాడికి దిగారు. అదనపు కట్నం కోసమే బాబితను రామకృష్ణ చంపినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు బబిత అత్తింటి వారు తెలిపిన వివరాల ప్రకారం.....బబితకి జోతిష్యం అంటే ఎంతో నమ్మకం. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితను భర్త రామకృష్ణ పలుమార్లు మందలించాడు. దీనిపై ఇటీవలే భార్యభర్తలకు వివాదం తలెత్తింది. ఆ సమయంలో అందరి ముందు భర్త రామకృష్ణ ఆమెని కొట్టాడు. దాంతో మనస్థాపం చెందిన బబిత ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అత్తింటి వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అంబర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొయినాబాద్ లో పట్టపగలే యువతి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పట్టపగలే దుండగులు ఓ యువతని హతమార్చి మృతి దేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు, రైతులు రోడ్డు పక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే 80% శరీరం కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని వేరే చోట హత్య చేసి అక్కడ తగలబెట్టినట్లుగా గుర్తించారు. ఆమె వయస్సు 20 నుంచి 25 మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యువతికి ఇంకా పెళ్లి కాలేదని పోలీసులు నిర్ధారించారు. దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో లభించిన సగం కాలిపోయిన ఫోన్ దొరకడంతో ఆ సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరో పక్క మృతురాలిపై ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయిందా? అనేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా