Siddipet District News : సిద్ధిపేటలో దారుణం.. మహిళను హత్య చేసి బంగారు ఆభరణాల చోరీ
Siddipet District Crime News: మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Siddipet District Crime News : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో గుర్తుతెలియని ఆగంతకుడు ఓ మహిళను హత్య చేసి… ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలను తీసుకొని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే…. సిద్దిపేట జిల్లా కొల్గూర్ గ్రామంలో చెన్న శ్యామల (55),ఆమె భర్త శ్రీనివాస్ నివసిస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 5 నుండి 5.30 గంటల సమయంలో శ్యామల బెడ్ రూమ్ లో నుండి లేచి కాళ్ల కృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న వాష్ రూమ్ వెళ్ళినది. అదే సమయంలో గుర్తు తెలియని ఒక అగంతకుడు ఇంట్లోకి వచ్చి ఆమె భర్త శ్రీనివాస్ బెడ్ రూమ్ లో నిద్రలో ఉన్నట్లు గమనించి బెడ్ రూమ్ కు బయటి నుండి గొళ్ళెం పెట్టాడు. ఆమె ఎప్పుడు వాష్ నుండి తిరిగి బయటకు వస్తుదా అని పక్కనే దాక్కున్నాడు. శ్యామల వాష్ రూమ్ నుండి తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను గట్టిగా పట్టుకుని దిండుతో ముఖంపై అదిమి పట్టుకోగా స్పృహ తప్పింది. అదే సమయంలో ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడు, అర తులం చెవి కమ్మలు తీసుకొని ఇంట్లో నుండి పారిపోయినాడు.
పదిహేను నిమిషాల తర్వాత శ్యామల మెల్లగా స్పృహలోకి వచ్చి బెడ్ రూమ్ గొళ్ళెం వేసి ఉండడం గమనించి, గొళ్ళెం తీసి జరిగిన సంఘటన గురించి భర్తకు వివరించింది. అప్పుడు భర్త శ్రీనివాస్ చుట్టుపక్కల అందరిని పిలిచి ఈ విషయం వారికి తెలిపాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్యామలను ప్రథమ చికిత్స కోసం గజ్వేల్ డాక్టర్ లింగం దగ్గరికి తీసుకొని వెళ్లారు. అతడు ప్రధమ చికిత్స చేసి ఆమెకు సీరియస్ గా ఉందని తదుపరి చికిత్స గురించి వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పాడు. వెంటనే వారు ఆమెను గజ్వేల్ ప్రైవేట్ హాస్పటల్ కి తీసుకెళ్లి చూపించగా శ్యామల అప్పటికే చనిపోయిందని అక్కడ డాక్టర్ లు నిర్ధారించారు. ఈ సంఘటనతో కొల్గూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి. అనురాధ కొల్గూర్ గ్రామంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. కేసును అన్ని కోణాలలో పరిశోధన చేసి త్వరగా ఛేదించాలని గజ్వేల్ ఎసిపి రమేష్, గజ్వేల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డికి సూచించారు.