Farmer protests: ఖనౌరీ బార్డర్ లో గుండెపోటుతో మరో రైతు మృతి; నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Farmer protests: వివిధ డిమాండ్ల సాధన లక్ష్యంగా చలో ఢిల్లీ నినాదంతో దేశ రాజధాని వైపు వేలాదిగా రైతులు కదం తొక్కుతున్నారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద వారిని హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Delhi Chalo: రైతుల దిల్లీ చలో పిలుపు మేరకు కొనసాగుతున్న నిరసనల్లో రైతుల మరణాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద నిరసన తెలుపుతున్న మరో రైతు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. పంజాబ్ కు చెందిన రైతు దర్శన్ సింగ్ గుండె పోటుతో మరణించాడని రైతు నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు.
పంజాబ్ రైతు
పంజాబ్ లోని బటిండా జిల్లాలో ఉన్న అమర్ గఢ్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల రైతు దర్శన్ సింగ్ ఫిబ్రవరి 13 నుంచి నిరసన తెలుపుతున్న ఇతర రైతులతో పాటు ఖనౌరీ సరిహద్దులో ఉంటున్నాడు. దర్శన్ సింగ్ గుండెపోటుతో మృతి చెందారని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి పంధేర్ తెలిపారు. ‘‘ఖనౌరీ సరిహద్దులో ఉన్న ఆయన ఈ రైతుల ఉద్యమంలో నాలుగో 'అమరవీరుడు'. మృతుడిని దర్శన్ సింగ్ (62)గా గుర్తించారు. గుండెపోటుతో ఆయన మరణించారు’’ అని పంధేర్ తెలిపారు. బాధిత రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ముగ్గురు రైతులకు ఇచ్చిన విధంగానే పరిహారం ఇవ్వాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చర్చలకు బ్రేక్
లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రైతులు (Farmer protests) పలు డిమాండ్లతో ఉద్యమం చేపట్టడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందిగా మారింది. దాంతో, రైతులతో చర్చలు ప్రారంభించింది. రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పలు దఫాల చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చలు జరగనుండగా, పోలీసుల కాల్పుల్లో పంజాబ్ కు చెందిన యువ రైతు శుభ్ కరణ్ సింగ్ (21) మరణించడంతో, ఆగ్రహంతో రైతులు ప్రభుత్వంతో చర్చలను నిలిపివేశారు. యువ రైతు శుభ్ కరణ్ సింగ్ (21) మరణానికి నిరసనగా శుక్రవారం రైతులు 'బ్లాక్ ఫ్రైడే' పాటించారు.
వేలాదిగా తరలివస్తున్న రైతులు
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం చట్టపరమైన హామీ, వ్యవసాయ రుణ మాఫీతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతులు ఫిబ్రవరి 13 నుండి తమ ట్రాక్టర్-ట్రాలీలు, మినీ వ్యాన్లు మరియు పికప్ ట్రక్కులతో శంభు మరియు ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద మకాం (Farmer protests) వేశారు. రైతుల నుంచి పెసర్లు, కందులు, మినుములు, మొక్కజొన్న, పత్తిని కేంద్ర సంస్థల ద్వారా ఐదేళ్ల పాటు ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని ఫిబ్రవరి 18 న ముగిసిన చివరి విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తరఫున ముగ్గురు కేంద్ర మంత్రులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.