తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy : ఎగువన భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న మంజీరా, సింగూర్, నిజాంసాగర్

Sangareddy : ఎగువన భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న మంజీరా, సింగూర్, నిజాంసాగర్

HT Telugu Desk HT Telugu

28 September 2024, 5:44 IST

google News
    • Sangareddy : కర్ణాటక, తెలంగాణలోని మంజీరా నది కాచ్‌మెంట్ ఏరియాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల నుండి వరద కొనసాగుతుండడంతో.. సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జల దిగ్బంధంలో ఏడుపాయల
జల దిగ్బంధంలో ఏడుపాయల

జల దిగ్బంధంలో ఏడుపాయల

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయాలు నిండు కుండల్లా మారాయి. మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఘన్పూర్ ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం రోజు సింగూరు ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 24,563 క్యూసెక్కులు ఉండగా.. గేట్లు ద్వారా 20,107 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్ధ్యం 29. 917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29. 827 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. దీంతో 6, 11 వ నెంబర్ గేట్లను 1. 50 మీటర్ల ఎత్తుతో గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.

మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతుండడంతో.. మృత్యకారులు, గొర్ల కాపరులు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. టీజీ జెన్కో అధికారులు పవర్ ప్లాంట్ ద్వారా.. 2,783 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ.. విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

జల దిగ్బంధంలో ఏడుపాయల...

సింగూరు ప్రాజెక్ట్ నుండి నీటిని దిగువకు వదులుతుండడంతో.. మంజీరా నది పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం.. జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు నీటిని కిందికి వదలడంతో ఘనపురం ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది.

ప్రాజెక్ట్ పైనుండి గంగమ్మ ప్రవహిస్తూ.. వనదుర్గామాత ఆలయాన్ని చుట్టుముట్టాయి. మూడు రోజుల నుండి ఆలయం జల దిగ్బంధంలో ఉంది. అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. నీటి మట్టం తగ్గగానే తిరిగి ప్రారభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఘన్పూర్ వనదుర్గ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడంతో.. పర్యాటకులు వస్తున్నారు.

టూరిజం హబ్‌గా నిజాం సాగర్..

దిగువనున్ననిజాం సాగర్‌కు భారీ వరద రావటంతో.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ప్రాజెక్టును పరిశీలించారు. నిజాంసాగర్‌ను, కౌలాస్ కోట ప్రాజెక్ట్‌లను టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నిజాంసాగర్ ప్రధాన కాలువల లైనింగ్ పనుల కోసం.. ఇప్పటికే ప్రభుత్వం రూ.459 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఈ సంవత్సరం ప్రాజెక్ట్ నిండిపోవటంతో.. ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం