తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  President Hyd Visit: హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి… టూర్ షెడ్యూల్ ఇదే

President Hyd Visit: హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి… టూర్ షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

02 December 2022, 20:33 IST

google News
    • President Draupadi Murmu Hyd Visits: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. ఈ మేరకు రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ ఖరారైంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (twitter)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu Hyderabad Tour: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 28 న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి.. 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. దక్షిణాది విడిది కోసం ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు.

2019 ఏడాదిలో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

3 రోజుల టూర్..!

డిసెంబర్ 28 వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి చేరుకుంటారు. డిసెంబర్ 29వ తేదీ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అథితులతో భేటీ అవుతారు. డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇక రాష్ట్రపతి పర్యటన ఖరారైన నేపథ్యంలో పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, బొల్లారం రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ, ఇతర కీలక శాఖలతో సీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. త్వరలోనే కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేశ 15వ రాష్ట్రపతి హోదాలో మొట్ట మొదటిసారి శీతాకాల విడిదికి ద్రౌపదీ ముర్ము రానున్నారు.

ఏపీలోనూ పర్యటన...

President Visit in AP: అధికారిక పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం విజయవాడ రాజ్ భవన్ కు రానున్నారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రాష్ట్రపతి విజయవాడ పర్యటనతో పాటు విశాఖపట్నం పర్యటన వరకుగవర్నర్ అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు.

రాష్ట్రపతి నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు డిల్లీ నుండి బయలు దేరి 10.15 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు లో (పోరంకి – నిడమానూరు రోడ్డు) రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన రాష్ట్రపతిని సన్మానిస్తారు. రాష్ట్రపతి ముర్ము పలువురు ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలుస్తారు.

అనంతరం రాష్ట్రపతి రాజ్ భవన్ కు చేరుకుంటారు. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చే అధికారిక విందుకు ద్రౌపతి ముర్ము హాజరవుతారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరి విజయవాడ నుండి విశాఖపట్నం నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్ధ ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలలో భాగంగా నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్దాపనలు చేస్తారు.

రాత్రికి అక్కడి నుండి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శన అనంతరం, గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్ధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి మధ్యాహ్నం నేరుగా డిల్లీ పయనం అవుతారు.

సంబంధిత కథనం

తదుపరి వ్యాసం