తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs : బీఆర్ఎస్​కు మహారాష్ట్ర పోలీసులు షాక్.. ఔరంగాబాద్ సభకు 'నో పర్మిషన్'

BRS : బీఆర్ఎస్​కు మహారాష్ట్ర పోలీసులు షాక్.. ఔరంగాబాద్ సభకు 'నో పర్మిషన్'

HT Telugu Desk HT Telugu

19 April 2023, 19:22 IST

google News
    • BRS Meetings in Maharastra: పార్టీని విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్… ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సభలు తలపెట్టగా… మూడో సభను కూడా ఖరారు చేశారు . అయితే మూడో సభకు మహారాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Public Meeting in Aurangabad:  జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రపై తెగ ఫోకస్ చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించగా… మరో భారీ సభను నిర్వహించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసే పనిలో ఉన్నారు నేతలు. ఇదిలా ఉంటే... మహారాష్ట్ర పోలీసులు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 24వ తేదీన అంఖాస్ మైదానంలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

పలు భద్రతా కారణాల రీత్యా అంఖాస్ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. అయితే ఔరంగాబాద్ లోని మిలింద్ కాలేజీ దగ్గర్లో సభ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కానీ అంఖాస్ మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి దశలో పోలీసులు షాక్ ఇవ్వటంపై కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఎలాగైనా సభను నిర్వహించాలని.... అవసరమైతే మరో ప్రాంతాన్ని ఖరారు చేయాలని నేతలకు సూచించినట్లు సమాచారం.  ఔరంగాబాద్​లోనే బిడ్ బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్న జంబిడా మైదానంలో సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా రేపోమాపో క్లారిటీ రావొచ్చని గులాబీ వర్గాల మేరకు తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత…. మహారాష్ట్రలో ఇప్పటి వరకు రెండు సభలను నిర్వహించారు. నాందేడ్‌ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సభను ఏర్పాటు చేయగా… రెండోది మార్చి 26వ తేదీన కంధార్‌ లోహా తలపెట్టారు. ఈ రెండు సభకు అక్కడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ రెండు సభలకు హాజరైన కేసీఆర్.. అక్కడివారిని ఆకట్టుకునేలా ప్రసంగించారు. ముఖ్యంగా కంధార్‌ లోహా వేదికగా కీలక ప్రకటన కూడా చేశారు. మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్తులపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ మోడల్, రైతుబంధు, రైతుబీమాతో పాటు పలు అంశాలను కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మూడో సభలోనూ కేసీఆర్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. ఇటీవల కూడా మహారాష్ట్రకు చెందిన పలువురు భారీగా బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఔరంగాబాద్ సభకు కూడా ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.... పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది.

ఇక మహారాష్ట్ర విషయంలో కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్‌ వంటి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారట...! అందులో భాగంగానే ఈ సభలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. చేరికల సంఖ్యను కూడా పెంచే పనిలో పడ్డారు కేసీఆర్. ముఖ్యంగా రైతు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరారు. మొత్తంగా మహారాష్ట్రలో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్… రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం