CM KCR in Maharashtra : మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ... గులాబీ జెండా ఎగరాలన్న కేసీఆర్
26 March 2023, 17:18 IST
BRS Meeting at Kandharloha:త్వరలో దేశంలో తుఫాన్ రాబోతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. మహారాష్ట్ర కాందార్ లోహలో తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన… మహారాష్ట్రలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
BRS Meeting in Maharashtra: తెలంగాణ మోడల్‌గా మహారాష్ట్రలోని ప్రతి రైతుకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివారం నాందేడ్ జిల్లాలోని లోహాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్రలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని... స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. తమని గెలిపిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
బీఆర్ఎస్ ను మహారాష్ట్రలోనూ రిజిష్టర్ చేయించామని ప్రకటించారు కేసీఆర్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి చూపిస్తానని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని వినతులు వస్తున్నాయన్న ఆయన... తర్వాత సభ షోలాపూర్‌లో పెడ్తామని చెప్పుకొచ్చారు.
"నాతో కలిసి యుద్ధం చేయండి. నీళ్లు వస్తాయి. పెద్ద ఎత్తున వనరులు మన దేశంలో ఉన్నాయి. కానీ కరెంట్ ఎందుకు ఇవ్వటం లేదు. ఎంతకావాలంటే అంత కరెంట్ ఇచ్చేందుకు మన దగ్గర బొగ్గు ఉంది. నీళ్లు అవసరానికి మించి ఉన్నాయి. 361 బిలియన్ టన్నుల బొగ్గు మన దగ్గర ఉంది. కానీ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నాం. అంబేడ్కర్ పుట్టిన నేలలో దళితబంధు అమలు చేయాలి. ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ దేశంలో సమస్యలు అలాగే ఉన్నాయి. 75 ఏళ్లలో ఎన్నో పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్ పాలన చూశాం, బీజేపీ పాలన చూస్తున్నాం. ఏం తేడా ఉందో చూస్తూనే ఉన్నాం. రైతులకు, పేదలకు ఏం వచ్చిందో చూడండి" అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను దయ్యబట్టారు కేసీఆర్.
"దేశంలోని వాతావరణం ఎంతో బాగుటుంది. మన దగ్గర నేల చాలా ఎక్కువ ఉంది. యాపిల్ తోటలు కూడా పడే పరిస్థితి ఉంటుంది. గోదావరి మహారాష్ట్రలో పుట్టింది కానీ ఇక్కడి ప్రజలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నేల అంతా ఎండిపోయి కనిపిస్తోంది. ప్రతి ఏటా 50 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇక్కడ పుష్కలంగా ఉంది. ఎవర్నో అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇన్నీ వనరులున్న మన దేశంలోని రైతులకు కరెంట్, నీళ్లు ఎందుకు ఇవ్వరు...? అని కేసీఆర్ ప్రశ్నించారు.
" నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారు. బీఆర్ఎస్ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా? ఆరు వేలు కదా ప్రతి రైతుకు రూ. 10 వేలు ఇవ్వాలి. ఇందుకోసం పోరాటం చేయటానికైనా సిద్ధంగా ఉండాలి. కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. ఈ తరహా మోడల్ అమలు చేస్తే నేను మహారాష్ట్రకు రానని ఫడ్నీవీస్ కు చెబుతున్నాను. అప్పటివరకు నేను వస్తూనే ఉంటాను. దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్తాను. మహారాష్ట్రలో రైతుబంధు పథకం అమలు చేసే వరకు కొట్లాడుతాం. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను" అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు.