CM KCR : అంబేడ్కర్ పేరిట తెలంగాణ సర్కార్ అవార్డు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Ambedkar Statue Inauguration in Hyd: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ అంబేడ్కర్ తో కలిసి పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అంబేడ్కర్ కృషిని, కీర్తిని కొనియాడారు.
CM KCR Speech in Inauguration of Ambedkar Statue: అంబేడ్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు చేయటం కాదు... ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు సీఎం కేసీఆర్. 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిపోయిందన్నారు. హైదరాబాద్ వేదికగా విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని వ్యాఖ్యానించారు.
"అంబేద్కర్ విశ్వ మానవుడు. ఆయన ఆలోచన విశ్వజనీనమైనది...ఆయన రచించిన రాజ్యాంగం సంవత్సరాలు దాటి పోతుంది..జయంతులు జరుపుకుంటూ పోవడమేనా... కార్యాచరణ ఉందా? అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం . ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం. ఇక్కడికి దగ్గర్లోనే అమరవీరుల స్మారకం ఉంది. విగ్రహ ఏర్పాటులో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలుపుతున్నాను. అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అావార్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. ఉత్తమ సేవలు అందించినవారికి అావార్డులు ఇస్తాం. ఇందుకోసం రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తాం. ఏటా అంబేడ్కర్ జయంతి రోజున ప్రదానం చేస్తాం. ఇక్కడ ఏర్పాటు చేసింది విగ్రహం కాదు... విప్లవం. దళితబంధు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చాం. రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. మనందరికీ మార్గదర్శం చేసేలా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు చేశాం" అని కేసీఆర్ గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కు మంచి ఆదరణ వస్తుందని అన్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసుకోవాల్సిన అసరం ఉందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మనదే అన్న ఆయన… మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఊహించని స్పందన వస్తోంద్నారు. భవిష్యత్ లో దేశంలో 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని ప్రకటించారు.
ఇక అంతకుముందు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అన్నారు. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదన్న ఆయన... రూపాయి సమస్యలపై 1923లోనే అంబేడ్కర్ పరిశోధన పత్రం రాశారని గుర్తు చేశారు, దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
"కేసీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏపీ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పెద్ద పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతు ఇచ్చారు. హైదరాబాద్ రెండో రాజధానిగా కూడా అంబేడ్కర్ సమర్థించారు" అని ప్రకాశ్ అంబేడ్కర్ గుర్తు చేశారు.
హెలికాప్టర్ నుంచి పూలవర్షం…
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బౌద్ధ గురువులను సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ సత్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు.
సంబంధిత కథనం